
సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థలను ఈనెల 31 నుంచి పునః ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడితే దీనిపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశముంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని బుధవారం స్పష్టం చేశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఈనెల 30 వరకూ పొడిగించింది. అయితే దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే క్రమంలో విద్యా బోధన కుంటుపడిందన్న వాదన కూడా విన్పిస్తోంది.
తాజా పరిస్థితిని గమనిస్తే కోవిడ్ తీవ్రత నెలాఖరుకు క్రమంగా తగ్గుతుందని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 31 నుంచి విద్యా సంస్థల రీ ఓపెనింగ్‌పై అధికారుల నుంచి నివేదిక కోరినట్టు మంత్రి ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అయితే, కరోనా తీవ్రత పెరిగితే సెలవులు పొడిగించకతప్పదనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ క్లాసులపై క్లారిటీ ఇవ్వకపోవడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించగా, కొద్ది రోజుల కోసం ఎందుకన్నట్టు బదులిచ్చారు. దీన్నిబట్టి పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం బలమైన నిర్ణయంతో ఉన్నట్టు తెలుస్తోంది.
పరీక్షల రద్దు ప్రసక్తే లేదు..
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పరీక్షల రద్దు, ప్రమోట్ చేయడం వంటివి ఉండబోవని సబిత తేల్చి చెప్పారు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతారని ఆమె అన్నారు. విద్యార్థులు ఇలాంటి ఆశలు పెట్టుకోకుండా వీలైనంత వరకూ పరీక్షల్లో విజయం సాధించేందుకు కష్టపడాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment