ధైర్యే సాహసే.. ఆరోగ్యం: కరోనా భయాన్ని జయించిన వృద్ధులు | Elderly Recovered From Corona | Sakshi
Sakshi News home page

ధైర్యే సాహసే.. ఆరోగ్యం: కరోనా భయాన్ని జయించిన వృద్ధులు

Published Fri, May 14 2021 12:24 PM | Last Updated on Fri, May 14 2021 12:44 PM

Elderly Recovered From Corona - Sakshi

వైద్యుల ఆత్మీయ స్పర్శే ప్రాణం నిలిపింది 
కరోనా సోకిందని తెలియగానే ఆందోళన చెందాను. కుటుంబసభ్యులు కూడా ఇబ్బందిపడ్డారు.  కానీ, నేను మాత్రం మనోస్థైర్యం తో ఉన్నా. 90 ఏళ్లకు వచ్చాను. ఇప్పుడేదైతే అదే అవుతుందని భావించాను. ఈ నెల ఐదో తేదీన గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌(టిమ్స్‌)లో చేరాను. వైద్యసిబ్బంది ఎంతో ప్రేమగా చూసుకున్నారు. వేళకు ఆహారం, మందులు ఇచ్చారు. ఆరోగ్యంగా ఇంటికి చేరాను. వారి ఆతీ్మయస్పర్శే నాకు పునర్జన్మను ప్రసాదించింది.
– మాణిక్యమ్మ(90), నేదునూరు, కందుకూరు మండలం, రంగారెడ్డి 



మానసిక ప్రశాంతతతో ఎదుర్కొన్నాను
నా పేరు నాగమణి, నాకు 73 ఏళ్లు. జ్వరం, జలుబు ఉండటంతో ఏప్రిల్‌ 15న నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచి్చంది. తొలుత భయాందోళనకు గురైనా పాజిటివ్‌గా ఆలోచిస్తూ కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూడటం, ఆవిరి పట్టడం, వేళకు ట్యాబ్లెట్లు వేసుకోవడంతోపాటు తేలికపాటి వ్యాయామాలు చేశాను. బలవర్థకమైన ఆహారం తీసుకున్నాను. హోం క్వారంటైన్‌ అనంతరం టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌ వచి్చంది.  
    – నాగమణి, పార్శిగుట్ట 


భయపడలేదు
నాకు పదిరోజుల క్రితం దగ్గు, జలుబు, ఒంటినొప్పులు, ఆయాసం వంటి సమస్యలు మొదలయ్యాయి. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇంట్లో వాళ్లంతా ఆందోళన చెందినా నేను భయపడలేదు. తొలుత ఫీవర్‌ ఆస్పత్రిలో చేరాను. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో మరునాడు కొత్తపేటలోని మరో ప్రైవేటు ఆస్పత్రిలో చేరాను. ప్రస్తుతం ఏ సమస్యా లేకపోవడంతో గురువారం ఉదయం డిశ్చార్జ్‌ చేశారు.  
– సత్యనారాయణ(88), హస్తినాపురం 

వారంరోజుల్లోనే ఇంటికి వచ్చిన..
నేను కె.రాములమ్మ. నాకు 92 ఏళ్లు. మాది గౌతంనగర్‌ డివిజన్‌ ఇందిరానెహ్రూనగర్‌. 15 రోజుల క్రితం కరోనా సోకింది. కుటుంబసభ్యులు స్థానికంగా ఉండే అంగన్‌వాడీ టీచర్‌ సహాయంతో అంబులెన్స్‌లో కింగ్‌కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాను. వారంపాటు చికిత్స తీసుకొని కరోనాను జయించి క్షేమంగా తిరిగి వచి్చన. నా రెండో కొడుకు స్వామిగౌడ్‌కు గత ఏడాది కరోనా సోకడంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
– రాములమ్మ(92), గౌతంనగర్‌  



ఏం చేశావ్, ఏం తిన్నావని అడుగుతుండ్రు
నా పేరు పడాల రాములు. మాది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం. 17 రోజుల కింద కాళ్ల నొప్పులు, కొద్దిగా జ్వరం వచ్చింది. పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌ అని వచ్చింది. ఇంట్లోనే ఉంటూ రోజూ మూడు పూటలా ఆవిరిపట్టాను. డాక్టర్‌ చెప్పినట్టు ఉదయం, సాయంత్రం గుడ్లు తిన్నా. ప్రభుత్వ దావకాండ్ల ఇచ్చిన మందులతోనే 14 రోజుల తర్వాత కరోనాను జయించాను. చాలామంది వచ్చి ఏ చేశావ్, ఏం తిన్నావని అడుగుతుండ్రు. ధైర్యంగా ఉంటే కరోనా చంపే రోగమేమీకాదు.
 – పడాల రాములు(80)


భయమే ప్రాణాంతకం
‘మాది కోనరావుపేట మండలం నిమ్మపల్లి. పక్షంరోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లాం. అక్కడ నాతోపాటు ఇద్దరు కొడుకులకు కరోనా అంటింది. అయినా భయపడలేదు. ఇంట్లోనే ఉంటూ డాక్టర్లు ఇచి్చన మాత్రలు వేసుకున్నాం. నాకు ఒకరోజు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ బెడ్లు ఖాళీ లేవనడంతో ఇంటికి వచ్చి మందులు వాడిన. ధైర్యంగా ఉండి కరోనా నుంచి కోలుకున్నాను. భయమే ప్రాణాంతకం. అందుకే భయపడొద్దు.
– విక్కుర్తి నర్సయ్య(96)

గుండె ధైర్యం రక్షించింది
నా పేరు బద్దం వెంకటరెడ్డి. మాది మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కొత్తూరు(సి). జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు రావడంతో కురవిలో పరీక్ష చేయిస్తే కరోనా నిర్ధారణ అయింది. ఇంట్లోనే ఉంటూ ఆశ కార్యకర్త, ఏఎన్‌ఎంలు ఇచ్చిన మందులు వాడాను. ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే నా కొడుకు చెప్పిన సూచనలు పాటించాను. పౌష్టికాహారం తీసుకుంటూ రోజూ ఉదయం ఎండలో కొద్దిసేపు కూర్చునేవాడిని. ఈ సమయంలోనే సూర్యాపేటలో ఉండే నా కుమార్తె కన్నుమూసింది. నాకు కరోనా ఉండటంతో కుమార్తెను కడసారి చూడలేకపోయాను. ఈ బాధ ఉక్కిరిబిక్కిరి చేసినా గుండెధైర్యంతో ఉండి కోలుకున్నా.  
– బద్దం వెంకటరెడ్డి(78), కొత్తూరు(సి), మహబూబాబాద్‌ జిల్లా 


వందేళ్ల బామ్మ.. ఇంట్లోనే కోలుకుంది! 
ఈ ఫొటోలో కనిపిస్తున్న బామ్మ పేరు యాళ్ల సీతారామమ్మ. వయసు వందేళ్లు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన ఈమెకు గత నెల 20న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ.. సకాలంలో మందులు, సరైన ఆహారం తీసుకుంటూ, వైద్యుల సలహాలు పాటించడంతో ఆమె కరోనాను జయించారు. ప్రస్తుతం ఆక్సిజన్‌ స్థాయి 97 నుంచి 98 ఉంటోందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈమె ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావులకు స్వయానా పెద్దమ్మ కావడం విశేషం. 
– సారవకోట (శ్రీకాకుళం జిల్లా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement