కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమి భయంతోనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పాదయాత్రకు తెరాస ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తుందని విమర్షించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అదేవిధంగా, ‘తాము ఎలాంటి ప్రలోభాలను నమ్ముకోలేదని.. ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజలను నమ్ముకున్నామని’ పేర్కొన్నారు.
కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమ గీతం పాడటం ఇక్కడి నుంచే మొదలవుతుందని అన్నారు. తమ పాదయాత్రకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు. కాగా, ఈ పాదయాత్ర గురించి పదిరోజుల క్రితమే ప్రకటించామని పేర్కొన్నారు. హుజురాబాద్‌లో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలకు ప్రభుత్వ పథకాలు మీదగ్గర అమలు చేస్తున్నారా.. అని ప్రశ్నించారు. యావత్ తెలంగాణకు విముక్తి కలిగేలా తొలి బీజం ఇక్కడే పడాలని ఈటల అన్నారు. ఇక్కడ తమకు అడ్డంకులు సృష్టిస్తే.. ఖబర్ధార్ అని హెచ్చరించారు.
ఇప్పటికైనా కేసీఆర్ చిల్లర వేశాలు మానుకోవాలని ఈటల హితవు పలికారు. కాగా, తన పాదయాత్రకు అండగా ఉండేందుకు అనేక వర్గాల ప్రజలు, అన్ని యూనివర్శిటీలు విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున వచ్చారని పేర్కొన్నారు. ఈ పాదయాత్ర 25-26 రోజుల పాటు ప్రతి పల్లెను, ప్రతి గడపను కలిసేలా సాగుతుందని వివరించారు. ప్రజలందరూ తనను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని ఈటల ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment