సాక్షి, హైదరాబాద్: వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం వైఖరిపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అంశంలో కేంద్రానికి ఒకలాగా.. రాష్ట్రాలకు మరోలాగా ధరలు నిర్ణయించడం ఏంటని ప్రశ్నించారు. ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని ఈటెల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. కరోనా కేసులను దాస్తే దాగేవి కావు. వైరస్ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం. కరోనా కేసులు ఎక్కడికక్కడ గుర్తించి ట్రీట్‌మెంట్ చేస్తున్నాం. కోవిడ్ కట్టడిలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించనవసరం లేదు. కరోనాతో మెజార్టీ ప్రజలు ఆర్థికంగా నష్టపోయారు. ప్రస్తుతం కేసులు పెరగడంతో ప్రజలు స్వచ్చందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు’’ అని ఈటెల తెలిపారు.
‘‘మహారాష్ట్రతో పోలిస్తే తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి. గాంధీ ఆస్పత్రిలో ఇబ్బంది పడుతున్నవారు కేవలం ఐసీయూలో ఉన్నవారే. తెలంగాణ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు, వైద్యులకు, మందులకు కొరత లేదు. ఇతర రాష్ట్రాల పేషెంట్లకు కూడా వైద్యం చేస్తున్నాం. కరోనా వైద్యం కోసం అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ప్రజలను కాపాడాల్సిన ఎజెండా కేంద్రానికి ఉండాలి’’ అన్నారు.
‘‘కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం వివక్ష చూపకూడదుభవిష్యత్తులో రాష్ట్రానికి 300 టన్నుల ఆక్సిజన్ అవసరం రావొచ్చు. కేంద్రానికైనా, రాష్ట్రానికైనా వచ్చే ఆదాయం ప్రజల నుంచే వస్తుంది. కరోనా అనేది.. దేశం ఎదుర్కొనే విపత్తు అని కేంద్రం తెలుసుకోవాలి. మున్సిపల్ ఎన్నికలు చాలా చిన్నవి. ప్రభుత్వాలు ఎంత చేసినా ప్రజల సహకారం లేకుండా మహమ్మారిని కట్టడి చేయలేం. ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను’’ అన్నారు ఈటెల.
Comments
Please login to add a commentAdd a comment