ఆర్‌వోఆర్ ముసాయిదా చట్టంపై సందేహాలకు నిపుణుల సమాధానాలు
పార్ట్–బీలో పెట్టిన 18 లక్షల ఎకరాల పరిస్థితి ఏంటి?
ధరణి పోర్టల్‌లో తప్పొప్పులకు అవకాశం ఉంటుందా?
గత చట్టానికి, ఈ ముసాయిదాకు తేడా ఏంటి?.. మ్యాప్ కావాలంటే సర్వేయర్ కావాల్సిందేనా?
ఇలాంటి ఎన్నో సందేహాలపై స్పష్టత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల రికా ర్డులను పారదర్శకంగా నిర్వహించడం కోసం ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్)–2024’ పేరిట ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకు రానుంది. దీనికి సంబంధించి ముసాయిదా ప్రతిని ప్రజలకు అందుబాటులో ఉంచింది. అందులోని అంశాలపై ప్రజల నుంచి సల హాలు, సూచనలను ఆహ్వానించింది. దీనితో వేలాది మంది నుంచి స్పందన వస్తోంది. కానీ ఇందులో సలహాలు, సూచనల కన్నా సందేహాలే ఎక్కువగా ఉంటున్నాయని రెవెన్యూ వర్గాల సమాచారం.
ముసాయిదాపై ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. సందేహాలకు అధికారికంగా జవాబు ఇచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ‘ఆర్‌వోఆర్–2024’ ముసాయిదా చట్టంలోని అంశాలపై ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్న సందేహాలను ‘సాక్షి’ సేకరించింది. వాటిని భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డితోపాటు కొందరు రెవెన్యూ అధికారుల ముందుపెట్టి.. ఆయా సందేహాలకు సమాధానాలను రాబట్టింది. ఆ సందేహాలు, సమాధానాలు ఇవీ..
సందేహం: కొత్త ఆర్‌వోఆర్ చట్టం తేవాల్సిన అవసరమేంటి?
సమాధానం: ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం లోపభూయిష్టంగా ఉంది. చాలా సమస్యలకు అందులో పరిష్కారం లేదు. సాదాబైనామాల పరిష్కార నిబంధన లేదు. అప్పీలు వ్యవస్థ లేదు. రికార్డులో ఏ సమస్య వచ్చినా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. ధరణి పోర్టల్‌లో సవరణలు చేసే అధికారాన్ని కూడా ఆ చట్టం ఎవరికీ కల్పించలేదు. ధరణి సవరణలకు చట్టబద్ధత కావాలంటే చట్టం మారాల్సిందే.
ధరణి సమస్యలను ఈ చట్టం ఎలా పరిష్కరిస్తుంది?
– ధరణి పోర్టల్‌లో చేర్చకుండా పార్ట్–బి పేరిట పక్కన పెట్టిన భూములను రికార్డుల్లోకి ఎక్కించడానికి కొత్త చట్టంలో నిబంధన ఉంది. దాదాపు 18లక్షల ఎకరాల భూమికి ఈ చట్టం ద్వారా మోక్షం కలుగుతుంది. ధరణిలో చేర్చిన తర్వాత నమోదైన తప్పుల సవరణకు కూడా చట్టబద్ధత ఏర్పడుతుంది.
రైతుల వద్ద ఉన్న పాస్‌బుక్‌లు రద్దవుతాయా?
– రద్దు కావు. ప్రస్తుతమున్న ధరణి రికార్డు కొనసాగుతుంది. కానీ తప్పొప్పులను సవరించవచ్చు. భవిష్యత్తులో ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టి, కొత్త రికార్డు తయారు చేయాలనుకుంటే మాత్రం కొత్త రికార్డుతోపాటు కొత్త పాస్‌బుక్‌లు వస్తాయి. ముసాయిదా చట్టంలో ఈ మేరకు నిబంధన ఉంది.
ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ వస్తుందా?
– ధరణి పోర్టల్ స్థానంలో కొత్త పోర్టల్ వస్తుంది. అయితే భూమాత అనే పేరు ఏదీ ముసాయిదా చట్టంలో లేదు. ధరణి అనేది ఆర్‌వోఆర్ రికార్డు నిర్వహించే పోర్టల్. ఈ పోర్టల్ స్థానంలో కొత్త పోర్టల్ వస్తుంది. దానికి ప్రభుత్వం ఇష్ట్రపకారం ఏ పేరైనా పెట్టవచ్చు.
ఇప్పుడు జరుగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పులొస్తాయి?
– స్లాట్ బుకింగ్ కొనసాగుతుంది. కానీ రిజిస్ట్రేషన్ అనంతరం మ్యుటేషన్ ప్రక్రియలో కొన్ని మార్పులుంటాయి.
ఆటోమేటిక్ మ్యుటేషన్ రద్దు అవుతుందా?
– పాత చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ జరిగితే ఆటోమేటిగ్గా మ్యుటేషన్ జరిగిపోతుంది. కొత్త చట్టం ముసాయిదా ప్రకారం ఈ మ్యుటేషన్ ఆగిపోదు. కానీ సరైన కారణాలుంటే మ్యుటేషన్ నిలిపేయవచ్చు. డబుల్ రిజిస్ట్రేషన్లకు, మోసపు లావాదేవీలకు ఈ నిబంధనతో చెక్ పడుతుంది. వారసత్వం, భాగం పంపకాలు, కోర్టు కేసులు, ఇతర మార్గాల్లో వచ్చే భూములపైనా విచారణ జరిపి మ్యుటేషన్ చేస్తారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే భూముల సర్వే మళ్లీ నిర్వహిస్తారా?
– భూములను మళ్లీ సర్వే చేయాలనే చట్టం చెబుతోంది. ముసాయిదా చట్టం ప్రకారం భూఆధార్ కార్డు జారీ చేయాలంటే సర్వే చేయాల్సిందే. తాత్కాలిక భూఆధార్ ఇవ్వాలన్నా రికార్డుల ప్రక్షాళన చేయాల్సిందే. భూఆధార్ కార్డు ఇవ్వాలా, వద్దా అన్నది ప్రభుత్వ అభీష్టం. ఈ మేరకు చట్టంలోని నిబంధనల్లో వెసులుబాటు ఉంది.
ఈ చట్టం వస్తే మళ్లీ పహాణీ రాస్తారా?
– పహాణీలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్న నిబంధన 1971 చట్టంలో ఉంది. కానీ 2020లో తొలగించారు. మళ్లీ ఇప్పుడు అప్‌డేట్ చేసే నిబంధన పెట్టారు. ముసాయిదాలోని సెక్షన్ 13 దీని గురించే చెబుతోంది.
ఈ చట్టంతో అసైన్డ్ భూములకు హక్కులు వస్తాయా?
– ఆర్‌వోఆర్ చట్టం అన్ని సమస్యలకు పరిష్కారం చూపదు. అసైన్డ్ భూములకు పట్టా హక్కు కావాలంటే మారాల్సింది ఆర్‌వోఆర్ చట్టం కాదు.. పీవోటీ చట్టం. కాబట్టి ఈ చట్టం ద్వారా అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు రావు.
కౌలు రైతుల పేర్లు నమోదు చేస్తారా?
– కౌలుదారుల నమోదు ప్రక్రియ కూడా ఆర్‌వోఆర్ చట్టం పరిధిలోకి రాదు. కౌలుదార్ల చట్టం–1950, రుణ అర్హత కార్డుల చట్టం– 2011 ప్రకారం కౌలుదారుల నమోదు జరుగుతుంది. ఆ చట్టాల పరిధిలో కౌలుదారుల గుర్తింపు జరుగుతుంది.
ఈ చట్టం ప్రకారం కాస్తు కాలం నమోదు ఉంటుందా?
– 1996లో గ్రామ రెవెన్యూ లెక్కల నిర్వహణ గురించి ప్రత్యేక జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం పహాణీల నిర్వహణ ఉంటుంది. ఆర్‌వోఆర్ చట్టం పరిధిలోకి ఈ అంశం రాదు. కాస్తు కాలం ఉంచాలా, వద్దా అన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు.
ఈ చట్టం ద్వారా టైటిల్ గ్యారంటీ ఇస్తారా?
– కొత్త చట్టానికి ల్యాండ్ టైటిల్‌కు సంబంధం లేదు. ఈ చట్టం హక్కులకు స్పష్టత మాత్రమే ఇస్తుంది. టైటిల్ గ్యారంటీ ఇచ్చేది వేరే చట్టం.
మ్యుటేషన్ సమయంలో మ్యాప్ కావాలన్న నిబంధన రైతులను ఇబ్బంది పెట్టేది కాదా?
– ఆర్‌వోఆర్ చట్టంలోని అన్ని నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చేవి కాదు. కొన్ని వెంటనే అమల్లోకి వస్తే.. మరికొన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొందుపర్చినవి. ఈ మ్యాప్ నిబంధనను అమలు విషయంలో ప్రభుత్వానికి సమయం ఉంటుంది. వ్యవస్థ పూర్తిస్థాయిలో ఏర్పాటైన తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. ఒకవేళ మ్యాప్ నిబంధన అమల్లోకి రావాలంటే సర్వేయర్ల వ్యవస్థను పటిష్టం చేయాల్సి ఉంటుంది.
(సాదాబైనామాలు, భూఆధార్‌కార్డులు, కోర్టులు, అప్పీళ్లు, ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు సంబంధించిన సమాచారం రేపటి సంచికలో..)
Comments
Please login to add a commentAdd a comment