సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ కన్నెగంటి లలితకు ఫుల్‌కోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. దాదాపు 7 వేల కేసుల్లో ఆమె తీర్పులు వెలువరించారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొనియాడారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మొదటి కోర్టు హాల్‌లో వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
జస్టిస్ లలిత ఇచ్చిన పలు తీర్పులను అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చదివి వినిపించారు. మోటార్ వెహికిల్ కేసులలో సత్వర న్యాయంతోనే బాధితులకు న్యాయం జరుగుతుందని, ఏళ్ల తర్వాత వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా అది ప్రయోజనం చేకూర్చదని జస్టిస్ లలిత ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇలాంటి కేసులలో న్యాయం త్వరగా అందించేలా కృషి చేయాలన్నారు. తనకు సహకరించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ లలిత కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..: అనంతరం హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ లలితకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సీజే జస్టిస్ అలోక్ అరాధే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ పల్లె నాగేశ్వర్‌రావు, ఏజీ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్‌గౌడ్, అసోసియేషన్ వైస్ చైర్మన్ కల్యాణ్‌రావు, కార్యదర్శులు పులి దేవేందర్, ప్రదీప్‌రెడ్డి, బైరెడ్డి శ్రీనివాస్, పూర్ణశ్రీ, శారద తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment