
భీమేశ్వరవాగు అవతల చిక్కుకున్న కూలీలు, వాగులో చిక్కుకున్న బస్సును ఒడ్డుకు నెట్టుతున్న స్థానికులు
తాడ్వాయి/ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): సాగు పనులకు వెళ్లిన 170 మంది కూలీలు వాగు అవతల చిక్కుకుపోగా..మరోచోట వరద నీటిలో విద్యార్థులతో కూడిన స్కూలు బస్సు చిక్కుకుపోయింది. ఈ రెండు ఘటనలు బుధవారం కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో చోటుచేసు కున్నాయి. కామారెడ్డి జిల్లా సంతాయిపేటకి చెందిన 170 మంది రైతులు, కూలీలు బుధవారం ఉదయం వ్యవసాయ పనులకు భీమేశ్వర వాగు అవతల ఉన్న పొలాలకు వెళ్లారు. మధ్యాహ్నం మండలంలోని దేమికలాన్, కరడ్‌పల్లి, నందివాడ, ఎండ్రియాల్ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.
దీంతో ఆయా గ్రామాల నుంచి చిన్నచిన్న వాగులు పొంగి ప్రవహిస్తూ భీమేశ్వరవాగు లో చేరడంతో ఈ వాగు ఉధృతమైపోయింది. దీంతో కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలు సుకున్న గ్రామస్తులు...వారిని వాగు దాటించేందుకు చేసిన యత్నం విఫలమైంది. దీంతో పోలీసులు, కామా రెడ్డి ఫైర్‌సిబ్బంది వాగు వద్దకు చేరుకుని జేసీబీ సాయంతో కూలీలను ఇవతలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే క్రమంలో వారూ చిక్కుకుపోయారు. చివరకు రాత్రి 11–12 గంటల మధ్య సమయంలో కష్టమ్మీద 50 మందిని వాగు దాటించి తీసుకువచ్చారు. మిగతా వారిని వాగు ఇవతలికి చేర్చే యత్నాలు కొనసాగుతున్నాయి.
వాగులో చిక్కుకున్న స్కూల్ బస్సు
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నశీంపేట వద్ద చివ్వెంల–ముకుందాపురం రహదారిపై లోలెవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వరదలో బుధవారం స్కూల్ బస్ చిక్కుకుపోయింది. ఉదయం ఆయా గ్రామాల నుంచి పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్లే సమయంలో నశీంపేట వద్ద లోలెవల్ బ్రిడ్జిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. డ్రైవర్ ఇదేమీ పట్టించుకోకుండా దాదాపు 24మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సును వరదలోకి తీసుకెళ్లాడు.
మధ్యలోకి రాగానే బస్సు ఇంజన్ విఫలమై బస్సు కదలకుండా ఆగిపోయింది. ఎంతకూ బస్సు స్టార్ట్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వెంటనే కార్యకర్తలను పురమాయించి స్థానికులతో కలసి బస్సును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పాఠశాలల యాజమాన్యాలు, పోలీసులతో ఫోన్‌లో మాట్లాడారు. తదనంతరం పోలీసులు ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment