
రెసిడెన్షియల్ స్కూళ్లపై సమీక్షిస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితరులు
105 నియోజకవర్గాల్లో 105 స్కూళ్ల నిర్మాణం పూర్తవ్వాలి
‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’పై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశం
ప్రతిపాదిత స్కూల్ స్థలాలను వెంటనే పరిశీలించాలి.. రాకపోకలకు అనువుగా ఉన్న ప్రాంతాలను ఎంచుకోవాలి
వారంలో నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల(Young India Residential Schools) (సమీకృత గురుకుల పాఠశాల)ను రెండేళ్లలో పూర్తిచేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 105 నియోజకవర్గాల్లో ఈ పాఠశాలలను నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించామని చెప్పారు. సమీకృత పాఠశాలల నిర్మాణానికి సంబంధించి స్థలాల సేకరణ, పనుల పురోగతి, ఇతర అంశాలపై శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించి నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తామని తెలిపారు. నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపులు పూర్తయినకొద్దీ అనుమతులు జారీ చేస్తూ.. పనులు ప్రారంభించాలని, గడువులోగా నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్థలాల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వండి
కొడంగల్, మధిర, హుజూర్‌నగర్‌లలో స్కూళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, మార్చి 20న పనులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. దీంతో ఇతర గురుకులాల నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదించిన స్థలాలు అనువుగా ఉన్నాయో, లేదో పరిశీలించాలని సీఎం సూచించారు. అనువైన స్థలాలు లేని ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు. అన్ని ప్రాంతాలకు రాకపోకలు అనువుగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలని స్పష్టం చేశారు.
ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యతగా గుర్తించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వీలైనంత త్వరగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి, స్థలాల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లో జిల్లా కలెక్టర్లు నివేదికలు సమరి్పంచాలని ఆదేశించారు. రెండేళ్లలో రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో సమీకృత గురుకులాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
మహిళా వర్సిటీలో చారిత్రక కట్టడాల పరిరక్షణ..
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. మహిళా విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర అవసరాల కోసం చేపట్టే నిర్మాణాలు యూనివర్సిటీల స్థాయిలో ఉండాలని, ఈ విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని సూచించారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని గదులు, ల్యాబ్‌లు, ప్లేగ్రౌండ్, ఇతర నిర్మాణాలు చేపట్టాలన్నారు. వర్సిటీ ప్రాంగణంలో ని చారిత్రక, పురాతన కట్టడాలను పరిరక్షించాలని, వాటికి అవసరమైన మరమ్మతుల విషయంలో పురావస్తు శాఖ అధికారులతో చర్చించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
‘పర్యాటక’ బడ్జెట్ పెంచుతాం: సీఎం
పర్యాటక శాఖకు బడ్జెట్ పెంచుతామని, ఆ శాఖ ఆదాయం సమకూర్చడమే కాకుండా ఎక్కడికక్కడ యువతకు ఉపాధి కల్పించే వనరుగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. పర్యాటకులను ఆకర్షించే వనరులు ఎన్నో ఉన్నా, ప్రచారంపై శ్రద్ధ చూపక, వినూత్న పద్ధతిలో ఆలోచించక ఆశించిన ప్రగతి లేదన్నారు. శుక్రవారం పర్యాటక శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు.
నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో బోట్ హౌస్ అందుబాటులో ఉంచాలని, డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు వేదికలు రూపొందించాలని సూచించారు. ఆలయాలు, అభయారణ్యాలకు పర్యాటకంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, వాటిని అభివృద్ధి చేయటంపై దృష్టి సారించాలని ఆదేశించారు. భువనగిరి కోట రోప్ వే పనులపైనా సీఎం ఆరా తీశారు. పర్యాటక పాలసీకి తుది రూపు ఇచ్చే సమయంలో అటవీ, ఐటీ, విద్యుత్, టీజీ ఐఐసీ, వైద్య, క్రీడల శాఖల మధ్య ఇబ్బందులు ఉండకుండా సమన్వయం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment