
పాపక్కపల్లిలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్
ఇల్లందకుంట (కరీంనగర్): ‘తెలంగాణ రాష్ట్రం కోసం.. టీఆర్‌ఎస్ పార్టీ ప్రజల గర్భం నుంచి పుట్టింది తప్ప కల్వకుంట్ల కుటుంబం నుంచి కాదు. జెండా కట్టి పార్టీని కాపాడే వాడే కార్యకర్త. కేసీఆర్ పార్టీ పెట్టి హైదరాబాద్‌లో కూర్చుంటే రాష్ట్ర సాధన అయ్యేదా?’అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని వావిలాల, పాపక్కపల్లి గ్రామాల్లో శుక్రవారం ప్రజాదీవెన యాత్ర చేపట్టారు. ‘నీ బిడ్డకు బీ–ఫారం ఇచ్చినవ్ కదా గెలిచిందా ఆమె. బొండిగ పిసికితే అయిపోతుంది అనుకున్నాడు. కానీ నాకు ప్రజల అండ ఉంది. నాకు ప్రజలతో ఉంది కుటుంబ సంబంధం. రేషన్ కార్డులు, పెన్షన్లు, దళితులకు 10 లక్షల స్కీం ఇవన్నీ నేను రాజీనామా చేస్తేనే వచ్చినయ్.
ప్రజల మీద సీఎంకు ఉన్న ప్రేమతో కాదట. ఓట్ల కోసం ఇస్తాడట. ధాన్యం కొననంటే కొనాలని అడగడం తప్పా.. ఈ రోజు ధాన్యం కొనకపోయి ఉంటే రైతు ఎంత నష్టపోయేవాడు ఆలోచించండి. ఇక నడవవు నీ ఆటలు. తప్పదు నీకు పతనం. ’అని అన్నారు. 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. అధికార బలంతో ప్రలోభాలకు గురిచేస్తే రానున్న రోజుల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ సెల్ జాతీయ కార్యదర్శి సుగుణాకర్ రావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment