సాక్షి, కరీంనగర్ : జిత్తుల మారి నక్క.. నక్కకు ఉన్న తెలివితేటలు ఎవరికీ ఉండవు అంటారు పెద్దలు. వ్యవసాయ బావిలో పడ్డ నక్క తెలివితో బయటపడి బతుకు జీవుడా అంటూ పరిగెత్తింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లిలో నక్క వ్యవసాయ బావిలో పడి ప్రాణాపాయ స్థితికి చేరింది. రైతులతో పాటు స్థానికులు చూసి అయ్యో పాపం అంటూ నక్కను కాపాడే ప్రయత్నం చేశారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఒకరు, పాత మంచం లోపటికి విడిచి బయటికి తీద్దామని మరొకరు ఇలా మాట్లాడుకుంటుండగానే నక్క తెలివిని ప్రదర్శించింది.
వ్యవసాయ బావిలో నీళ్లలో ఉన్న కరెంటు మోటార్కు సంబంధించిన వైరును నక్క నోటితో కొరికి కట్ చేసింది. ఆ వైరును నోటితో జిత్తుల మారి నక్క గట్టిగా పట్టుకోగ రైతులు మెల్లిగా లాగారు. రైతుల సహాయానికి నక్క సహకరించి ప్రాణాలతో బయట పడింది. బతుకు జీవుడా అంటూ పక్కనే ఉన్న గుట్టల్లోకి పరిగెత్తింది. అపాయంలో ఉపాయం అంటు నక్క తన తెలివిని ప్రదర్శించడాన్ని చూసినవారు నక్క తెలివిని మెచ్చుకుంటూ అక్కడి నుంచి మెల్లిగా ఇంటికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment