నా ఇద్దరు ప్రాణమిత్రులు 36 ఏళ్లుగా ప్రతి కష్టం, సుఖంలో ఉన్నారు
స్నేహితుడు వెంట ఉంటే గొప్ప ధైర్యం ఉన్నట్టే: డీజీపీ జితేందర్
సాక్షి, హైదరాబాద్: మంచి స్నేహితుల సాన్నిహిత్యం దొరికితే జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఛేదించవచ్చని.. జీవితాన్ని ఉత్తమంగా ఆస్వాదించవచ్చని చెప్పారు డీజీపీ జితేందర్. తాను ఈ స్థాయికి ఎదగడంలో తన స్నేహితుల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయని గుర్తు చేసుకున్నారాయన. 36 ఏళ్ల తమ స్నేహ జీవితంలో ఎన్నో సందర్భాలు చూశామని, ఆ మధురస్మృతులను స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు డీజీపీ జితేందర్...
ఆ విషయాలు ఆయన మాటల్లోనే...
‘‘నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఒకరు ప్రస్తుతం జార్ఖండ్‌లో ఐఏఎస్‌గా పనిచేస్తున్న డా.ఏపీ సింగ్, మరొకరు కేంద్ర ప్రభుత్వ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డా.రాజీవ్ వర్‡్షనై. మేం ముగ్గురం ఢిల్లీ జేఎన్‌యూలో స్కూల్ లైఫ్ సైన్స్‌లో ఎంఫిల్ చేశాం. ఐదేళ్లపాటు ఒకే దగ్గర కలిసి ఉన్నాం.. మా జీవితాలను మలుపు తిప్పింది ఆ ఐదేళ్లే. యూపీఎస్సీకి బీజం పడింది అక్కడే.. నేను ఈ రోజు డీజీపీగా ఉన్నానంటే అందుకు ఆ స్నేహమే కారణం. నేను ఐపీఎస్, ఏపీ సింగ్ ఐఏఎస్, రాజీవ్ సైంటిస్ట్‌లుగా కెరీర్ మలచుకున్నాం.
36 ఏళ్లుగా మా స్నేహం కొనసాగుతూనే ఉంది.. నా ప్రతి కష్టంలో, సంతోషంలో ప్రాణ మిత్రులిద్దరూ నాతో ఉన్నారు. మేం ఎప్పుడు కలిసినా కుటుంబాలతో సహా కలుస్తాం. ప్రతి రెండు, మూడేళ్లకు ఒకసారి తప్పకుండా మా ఫ్యామిలీస్ గెట్ టు గెదర్ ఉంటుంది. స్నేహం గురించి చెప్పాలంటే ఏదో ఆశించి చేసే స్నేహం ఎప్పటికీ నిలవదు. ఫ్రెండ్‌షిప్ అనేది ఒక ఎమోషనల్ ఫీలింగ్..ఒక సెక్యూరిటీ..మంచి స్నేహితులున్న వారు జీవితంలో ఉన్నతంగా ఉంటారు.
ఉత్తమ జీవితం గడుపుతారు. అందుకు నేను ఉదాహరణ. ప్రతి ఒక్కరి జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ చాలా ముఖ్యం. మంచి స్నేహితుడు ఉంటే ఏ ఒత్తిడీ మన దరి చేర దు. అందుకే యువతకు నేను చెప్పేది ఒక్కటే. మంచి స్నేహితులను సంపాదించుకోండి.. జీవితాన్ని ఫలవంతంగా..ఆనందంగా గడపండి’’అని డీజీపీ జితేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment