సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు అందజేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టిస్తామని వెల్లడించారు. శనివారం ఇక్కడ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగిన కాంగ్రెస్ ప్రచార కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్, బీజేపీల గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీ పరిస్థితి ఏంటో మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అడిగితే చెబుతారని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఎంపీల్లో సగం మంది బయటి నుంచి వచ్చిన వాళ్లేనని, వారికి నమస్తే... సదావత్సలే అంటే ఏంటో కూడా తెలియదని అన్నారు. రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలు ఈటల రాజేందర్, రాజగోపాల్‌రెడ్డిలకు దీని గురించి తెలుసా అని ప్రశ్నించారు. తననుద్దేశించి తెలంగాణకు పట్టిన వ్యాధిగా అభివర్ణించిన మంత్రి కేటీఆర్‌కు వ్యాధికి, వ్యాధులకు తేడా తెలియదని అన్నారు. తాను ఉద్యమం చేస్తున్నప్పుడు ఆయన అమెరికాలో ఉన్నారని చెప్పారు.
తెలంగాణకు కాంగ్రెస్, టీడీపీలు మోసం చేశాయని అంటున్నారని, ఆ రెండు పార్టీల్లో కేసీఆర్ ఉన్నారని, తెలంగాణకు ఏ అన్యాయం ఎప్పుడు జరిగినా కేసీఆరే ప్రత్యక్ష ద్రోహి అని విమర్శించారు. తన పార్టీ పేరులోని తెలంగాణ పదం తీసేసి ఆ పేరును హత్య చేసిన కేసీఆర్ తెలంగాణవాది ఎలా అవుతారని ప్రశ్నించారు. సెస్టెంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తామని, ఆ తర్వాత తాము ప్రజలకు ఏం చేస్తామో కూలంకషంగా వివరిస్తామని రేవంత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment