సాక్షి, నిజామాబాద్: ఎరుపు రంగులోని వడ్లు.. లోపల నల్లటి బియ్యం.. సాధారణంగా కనిపించే ధాన్యం.. లోపల ఎర్రని బియ్యం.. ఇలా ఎన్నో రకాలు. కొన్నింటిలో పోషకాలు చాలా ఎక్కువ. మరికొన్నింటి దిగుబడి ఎక్కువ. బాగా చిన్నగా ఉండేవి కొన్ని, గుండ్రంగా ధనియాల్లా కనిపించే బియ్యం రకాలు ఇంకొన్ని.. ఇవన్నీ ఎక్కడెక్కడో కాదు. ఒకేచోట పండుతున్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరుకు చెందిన నాగుల చిన్నగంగారాం పూర్తి సేంద్రియ విధానంలో వీటిని పండిస్తున్నారు.
పొలాన్నే ప్రయోగశాలగా మార్చి..
ఒక యోగా గురువు వద్ద సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత గురించి తెలుసుకున్న చిన్న గంగారాం.. 2007లో సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టారు. ఏకంగా 110 రకాల వరి విత్తనాలను సేకరించి సాగుచేస్తున్నారు. ఇందులో మన దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు పలు ఇతర దేశాల వరి రకాలు కూడా ఉండటం గమనార్హం. తాను సాగు చేసిన వివిధ రకాల వరి విత్తనాలను ఇప్పటికే 8 రాష్ట్రాలకు చెందిన 570 మంది రైతులకు అందించారు.
బియ్యం నుంచి మొలకలు తెప్పించి..
సాధారణంగా ధాన్యం నుంచే మొలకలు వస్తాయి. కానీ గంగారాం బియ్యం నుంచి మొలకలు తెప్పించి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా చేశారు. అమెరికా నుంచి తెచ్చిన కాలిఫోర్నియా రైస్, ఇటలీ నుంచి తెచ్చిన రిసోట రకం బియ్యం నుంచి మొలకలు వచ్చేలా చేసి సాగు చేశారు.
రోజుకో రకం బియ్యం తింటూ..
మన దేశంలో వందేళ్ల క్రితం 40వేల రకాల వరి విత్తనాలు ఉండేవని, వాటిలో 30 వేల రకాలు కనుమరుగయ్యాయని గంగారాం చెప్పారు. మిగతా రకాలను ఔత్సాహిక రైతులు కాపాడుతూ వస్తున్నారని తెలిపారు. అందులో కొన్ని దేశవాళీ రకాలు ఎంతో ప్రత్యేకమైనవని వెల్లడించారు. తనవద్ద ఉన్న 110 రకాల్లో 30 రకాలను రోజూ ఒక రకం బియ్యం అన్నం తింటున్నానని తెలిపారు. ఇన్ని రకాల వరిసాగును ఆయన నాలుగు ఎకరాల్లో చేస్తున్నారు.
గంగారాం వద్ద ఉన్న వరి విత్తనాల్లో ప్రత్యేకమైన కొన్ని..
కృష్ణవీహి: ధాన్యం ఎర్రరంగులో, బియ్యం నల్లరంగులో ఉంటాయి. రెండు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతుంది.
రామ్‌లక్ష్మణ్: ఈ రకం వరిలో రెండు బియ్యం గింజలు ఉంటాయి. ధాన్యం తెల్లగా, బియ్యం గోధుమ రంగులో ఉంటుంది.
కాలజీర: పరమాన్నం (పాయసం) స్పెషల్. పైరు ఏకంగా 5 అడుగుల ఎత్తు పెరుగుతుంది.
విష్ణుభోగ్: గింజ బాగా చిన్నగా ఉంటుంది. 135 రోజుల పంట.
చిన్నపొన్ను: తమిళనాడు రకం. ధనియాల మాదిరిగా ఉంటాయి. పైరు 2 అడుగుల వరకు పెరుగుతుంది.
గంగాగోల్డెన్ బ్రౌన్‌రైస్: అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి గోల్డెన్ బ్రౌన్‌రైస్ (బియ్యం) తీసుకొచ్చి వాటి నుంచి మొలకెత్తించారు. ఇది ఒక అడుగు ఎత్తు మాత్రమే పెరిగే రకం.
గంగా స్వీట్ బ్రౌన్‌రైస్: ఇది ఒక అడుగు మాత్రమే పెరుగుతుంది. నష్టం తక్కువ. గింజలు త్వరగా రాలిపడవు.
మెడిసినల్ రెడ్‌రైస్: ధాన్యం సాధారణ రంగులో ఉన్నా.. బియ్యం ఎరుపురంగులో ఉంటాయి. ఈ బియ్యంలో 18 రకాల పోషకాలు ఉంటాయి. ఐదేళ్లు దాటినా ఈ ధాన్యం బూజు, దుబ్బ, పురుగు పట్టదు. ఇది దేశవాళీ రకం.
కుంకుమ బంతులు (బుడుమ వడ్లు): తెలంగాణలోని నల్లగొండ ప్రాంతానికి చెందినవి. దిగుబడి తక్కువ అయినా బలం ఎక్కువ.
గంగా గ్రీన్ బ్లాక్ రైస్: ఇది జపాన్ నాటురకం. ధాన్యం, బియ్యం నల్లగా ఉంటాయి. దిగుబడి ఎక్కువగా వస్తుంది.
రిసోట రైస్: ఇది ఇటలీ రకం. ధాన్యం లావుగా గుగ్గిళ్లలా ఉంటుంది. ప్రతి గింజకు ముల్లు ఉంటుంది.
రత్నాచోళి: పోషకాలు ఉన్న ఈ బియ్యం తింటే కండరాలు గట్టి పడతాయని చెప్తారు.
మాపిళ్‌లై సాంబ: ఈ బియ్యం తింటే వీర్య కణాలు, అండకణాలు పెరుగుతాయని గంగారాం చెబుతున్నారు.
గంగా జపనీ గ్రీన్ బ్లాక్‌రైస్: ఇది 110 రోజుల పంట. ధాన్యం, బియ్యం నల్లగా ఉంటాయి.
కర్పూకౌని: ఈ బియ్యం తింటే శరీరంలోని పనికిరాని కొవ్వు కరిగి బరువు తగ్గుతారని చెప్తారు.
గంగా రూబీ రెడ్‌రైస్: వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ బియ్యం చిరుధాన్యాలతో సమానం.
ఫర్‌బిడెన్ రైస్: ఇది చైనా రకం. ఈ బియ్యం నీళ్లల్లో వేస్తే వండే పని లేకుండా రెండుగంటల్లో అన్నం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment