అధికారులతో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్
సాక్షి, హైదరాబాద్: ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి ఏక సంఘంగా ఏర్పడిన బీసీ కులాలకు నిర్మాణ అనుమతులు జారీచేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. శుక్రవారం మంత్రి కమలాకర్ తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 18 కులాలు ఏ కులానికి ఆ కులం ఏక సంఘంగా ఏర్పడి బీసీ సంక్షేమ శాఖను సంప్రదించాయని, వాటికి ఆయా కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనుల నిమిత్తం అనుమతి ప్రతాలు జారీ చేశామని, అతి త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు.
మిగతా కులాలు కూడా ఏక సంఘంగా ఏర్పడాలని, ఇందుకు ఈ నెల 14వ తేదీ వరకు గడువు విధిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గడువులోగా ఏకసంఘంగా ఏర్పడకుంటే ఆయా కులాల ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వమే పూర్తి చేస్తుందన్నారు. బీసీ కులాల కోసం రాష్ట్ర రాజధాని నడిబొడ్డున రూ.వేల కోట్ల విలువైన స్థలాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారని, బీసీల ఆత్మగౌరవం ఇనుమడించేలా వీటి నిర్మాణాలు చేపట్టడం కోసం 82 ఎకరాలు, రూ.96 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అనంతరం బీసీ స్టడీ సర్కిల్ నిర్వహణపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించబోయే 80,039 ఉద్యోగాల భర్తీలో బీసీ స్టడీ సర్కిళ్లు నిరుద్యోగులకు అత్యుత్తమ శిక్షణ ఇస్తాయని, ఇప్పటికే గ్రూప్–1 కోచింగ్ ప్రారంభమైందన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment