సాక్షి, హైదరాబాద్: ‘మన దేశంలో కరోనా ముమ్మరమయ్యే నాటికి వైరస్ గురించి మనకు తెలిసిన విషయాలకంటే ఇప్పుడు మరింత సమాచారం తెలిసి వచ్చింది. ఈ కొత్త పరిజ్ఞానంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో, చికిత్స ప్రక్రియల్లో ఎన్నో మార్పులొచ్చాయి’ అంటున్నారు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అధినేత, ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా వచ్చే కోవిడ్–19 వ్యాధి ఏమాత్రం ఆందోళనపడదగినది కాదని చెబుతున్నారాయన. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇంకా ఏమన్నారంటే..
వైరస్ మారినా వ్యాక్సిన్ పనిచేస్తుంది
దేశంలో కరోనా ప్రవేశించిన జనవరి నాటికీ, ఇప్పటికీ వైరస్‌లో చాలా మార్పులొచ్చాయి. దాదాపు 200కుపైగా మ్యుటేషన్స్ జరిగాయి. ఇప్పుడు డీ614జీ అనే మ్యుటేషన్‌తో ‘ఏ2ఏ టైప్’ వైరస్ దేశంలో విస్తరిస్తోంది. దీని వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రత గతంలో కంటే తక్కువనే భావిస్తున్నారు. ఇప్పటివరకు వైరస్‌లో ఎన్ని మార్పులొచ్చినా.. ‘రిసెప్టార్ బైండింగ్ ఏరియా’లో మ్యుటేషన్లేవీ రాలేదు. కాబట్టి ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న వ్యాక్సిన్లన్నీ ప్రభావవంతంగానే పనిచేస్తాయి. కాబట్టి వ్యాక్సిన్‌పై ఆశలు పెట్టుకోవచ్చు. అయితే, వ్యాక్సిన్ పనిచేసినా, దాని ప్రభావం శరీరంలో ఎంతకాలం ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటికి 3 నెలలు మాత్రం ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు గమనించారు. అయితే, ఏడాది పాటు ఉండొచ్చనీ, వ్యాక్సిన్ ప్రతి ఏడాదీ తీసుకోవాల్సి రావచ్చన్నది ప్రాథమిక అంచనా.
డిసెంబర్ లేదా జనవరి నాటికి టీకా..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 25 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి. వీటిలోనూ ఆరు వ్యాక్సిన్లు మూడో దశ పరీక్షల్లోనూ, 19 వ్యాక్సిన్లు ఒకటీ/రెండో దశల్లో ఉన్నాయి. మన దేశంలో మూడు వ్యాక్సిన్లు ప్రస్తుతం రెండోదశ పరీక్షల్లో ఉన్నాయి. ఇక మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్లు మూడో దశలో విజయవంతంగా తమ ప్రభావాన్ని నిరూపించుకుంటున్నాయి. డిసెంబరు లేదా జనవరి తొలివారం నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు. ఇక రష్యా వ్యాక్సిన్ విషయానికొస్తే.. సాధారణంగా వ్యాక్సిన్ తయారీ తర్వాత దాన్ని మూడు దశల్లో పరీక్షించాలి. రష్యన్ వ్యాక్సిన్‌ను రెండోదశ పరీక్షల తర్వాత, వెంటనే కమర్షియల్ తయారీకి ఉపక్రమించారు. ఒక వ్యాక్సిన్ రోగులకు ఎంత సురక్షితమో నిర్ణయించేందుకు రెండు దశల పరీక్షలు సరిపోవు. కాబట్టి మళ్లీ వాళ్లు మూడో దశ ప్రయోగాలకు దిగారు.
రీ–ఇన్ఫెక్షన్‌తో ప్రమాదం లేదు
హాంగ్‌కాంగ్‌లో రెండోసారి ఇలా రీ–ఇన్ఫెక్షన్ వస్తోందంటున్నారు. తెలంగాణలోనూ ఒకటి రెండు కేసులొచ్చాయి. ఇక్కడ గమనించాల్సింది.. మొదటిసారి కరోనా వైరస్ సోకడం వల్ల కోవిడ్–19 అనే వ్యాధి వస్తుంది. కానీ రెండోసారి వైరస్ సోకినప్పటికీ కోవిడ్‌గానీ లేదా ఇతరత్రా ఎలాంటి వ్యాధీ రాదు. రెండోసారి వైరస్ సోకడం వల్ల కోవిడ్ వస్తుందన్నది అపోహే.
వైరస్ వ్యాప్తి: నాడు – నేడు
గతంలో నోటి నుంచి వచ్చే తుంపర్లు వస్తువులపై పడటం, వాటిని ముట్టుకున్న చేతులతో ముక్కు, నోరు, కళ్లకు తాకితే వైరస్ సోకుతుందని అనుకునేవాళ్లం. దీన్నే ‘డ్రాప్‌లెట్ ట్రాన్స్‌మిషన్’ అంటారు. అయితే, దీనికంటే ‘ఏరోసాల్ ట్రాన్స్‌మిషన్’ వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువని తాజాగా తేలింది. అంటే తుంపర్ల కంటే మనుషులు మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి వెలువడే గాలికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కావడం వల్లనే వైరస్ వ్యాప్తి ఎక్కువన్న మాట. గతంలో శానిటైజర్‌తో తరచూ చేతులు కడుక్కోవడానికి ప్రాధాన్యమిచ్చాం. కానీ, ఇప్పుడు మాస్క్ పెట్టుకోవడమే కరోనా కట్టడికి మేలైన మార్గం. మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి వెలువడే గాలి తుంపర్లు సోకకుండా ఉండటానికి భౌతికదూరం తప్పక పాటించాలి. భౌతికదూరం అనేది లాక్‌డౌన్ అంతటి ప్రభావం చూపుతుంది. మాస్క్ పెట్టుకుని అవతలి వ్యక్తికి కనీసం 6 నుంచి 9 అడుగుల దూరంలో ఉండాలి. ఇప్పుడు ఇన్‌డోర్స్ కంటే ఔట్‌డోర్స్‌లోనే ఏరోసాల్ ట్రాన్స్‌మిషన్‌కు అవకాశం తక్కువ. కాబట్టి బయటకు వెళ్తే భౌతికదూరం పాటిస్తూ సురక్షితంగా పనిచేసుకోవచ్చు. ఇక, ఏరోసాల్ ట్రాన్స్‌మిషన్ వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువంటున్నారు కాబట్టి గాలి ద్వారా వ్యాపిస్తుందా అంటే ‘లేద’నే చెప్పాలి. అంటే ఓ వ్యక్తి సమీపంలో ఉండి మాట్లాడుతుంటేనే ఆ గాలి ద్వారా వ్యాపించే అవకాశమెక్కువ. అంతేకానీ, ఎవరూ లేనిచోట వైరస్ గాలిలో ఉండటం, మనం అక్కడికి వెళ్లినప్పుడు సోకడం జరగదు. ఇక, ఏసీ ఇన్‌డోర్స్ విషయానికొస్తే.. లామినార్ ఫ్లో ఉండే ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం ఉన్నచోట వైరస్ వ్యాప్తి జరగదు. ఈ ఏసీలో తాజా గాలి పై నుంచి వస్తూ, కలుషిత గాలులు కిందికి వెళ్తుంటాయి. అందుకే ఇప్పుడు హాస్పిటల్స్ యాజమాన్యాలు లామినార్ ఫ్లో ఏసీ సౌకర్యాలను కల్పించుకుంటున్నాయి.
శరీరంలో వైరస్ ప్రభావం..పరీక్షలు
గతంలో వైరస్ గొంతు ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతుందని అనుకునేవాళ్లం. ఇప్పుడది నోరు, ముక్కు ద్వారా ప్రవేశించాక నేరుగా రక్తప్రవాహంలోకి వెళ్లి.. అక్కడ రక్తనాళాల గోడలకు అంటుకుని వాటిని దెబ్బతీస్తుంది. వైరస్ ప్రవేశించిన మొదటి వారం అది రక్తంలోకి ప్రవేశించడాన్ని ‘వైరీమియా’ అంటారు. ఈ దశలోనే రెమ్‌డిస్‌విర్, ఫావీపిరావిర్ (ఫాబి ఫ్లూ) వంటి యాంటీవైరల్ మందులివ్వాలి. ఇక రెండోవారం అది ఊపిరితిత్తులపై దాడిచేస్తుంది. ఆ సమయంలో దేహంలో సైటోకైన్స్ విరివిగా తయారై.. వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో ఇవి మన దేహభాగాలనే దెబ్బతీస్తాయి. ఈ ప్రమాదాన్ని నివారించడానికి రెండో వారంలో డెక్సామిథోజోన్ వంటి స్టెరాయిడ్స్ ఇవ్వాలి. గతంలో దీనికి భిన్నంగా రివర్స్‌లో ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త ప్రొటోకాల్ ప్రకారం తగిన మందులిస్తూ మరణాలను చాలా వరకు తగ్గించగలిగాం. ఇక, ‘ఐఎన్6’, ఫెరిటిన్, ఎల్‌డీహెచ్, సీఆర్‌పీ, డీడైమర్ అనే పరీక్షల ద్వారా సైటోకైన్ కణాల విజృంభణ, సైటోకైన్ స్టార్మ్ తీవ్రతను అంచనా వేయవచ్చు. డీడైమర్ అనే పరీక్ష ద్వారా రక్తంలో గడ్డలు (బ్లడ్‌క్లాటింగ్) ఎక్కువగా ఉందా అనేది తెలుస్తుంది. గతంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలకు ముక్కు నుంచి శాంపుల్స్ (నేసల్ శ్వాబ్) తీసుకునేవారు. ఇప్పుడు ఉమ్ము టెస్ట్ చేసినా తెలిసిపోతుంది.
కరోనా.. కొత్త చికిత్సలు
కరోనా చికిత్సలో వెంటిలేటర్ కంటే ‘హై ఫ్లో నేజల్ ఆక్సిజన్’ చికిత్స మంచి ఫలితాలనిస్తోంది. ముక్కు ద్వారా చాలా ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ పంపడమనే ఈ చికిత్సలో సత్ఫలితాలు రాబడుతున్నాం. ఇక, ప్లాస్మా థెరపీ విషయానికొస్తే.. కన్వలసెంట్ ప్లాస్మాథెరపీలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఎక్కువుంటేనే ఈ చికిత్స ప్రభావం చూపుతుందని తేలింది. ఈ చికిత్సను సైతం వ్యాధి సోకిన తొలివారంలో అందించాలి. తాజాగా ‘మోనోక్లోనల్ యాంటీబాడీస్’ చికిత్స అందుబాటులోకి వచ్చింది. మనకు రోగనిరోధకతనిచ్చే యాంటీబాడీన్ మన దేహంలో ‘బీ సెల్స్’ అనే కణాల్లో తయారవుతాయి. వీటిని తీసుకుని, వాటి నుంచి పెద్దసంఖ్యలో యాంటీబాడీస్ తయారుచేసి, ఎక్కించడమే ఈ చికిత్స విధానం. ఇది కూడా మంచి ప్రభావమే చూపుతోందని తేలింది.
యాంటీబాడీస్ పెరిగితే వ్యాక్సిన్‌తో పనిలేదు..
మనం చేస్తున్న పరీక్షల్లో 10 శాతం మందికే పాజిటివ్ వస్తోంది. మరణాలు ఒక శాతం కంటే కూడా తక్కువే. అయితే స్థూలకాయం ఉన్నవారికి ప్రమాదకరమే. కాబట్టి ఫిట్‌నెస్ కాపాడుకోవాలి. పరీక్షల సందర్భంలో మన సమాజంలో 25% మందిలో యాంటీబాడీస్ ఉన్నట్టు తేలింది. కొద్దిరోజుల్లో ఇది 60శాతానికి చేరితే, అప్పుడిక వ్యాక్సిన్ అవసరం కూడా ఉండకపోవచ్చు. అప్పటివరకు అందరూ మంచి పోషకాలతో ప్రోటీన్లు ఎక్కువుండే ఆహారం తీసుకోవాలి. రోజూ విటమిన్–సీ 500 మి.గ్రా.; విటమిన్ బీతో పాటు 60 మి.గ్రా. జింక్ ఉండే మాత్రలు తీసుకోవాలి. ఒకసారి 60,000 యూనిట్లు అందేలా వారానికోసారి విటమిన్–డీ టాబ్లెట్స్ తీసుకుంటూ రోజూ ఉదయం, సాయంత్రం ఆవిరి పడుతుండాలి. పల్స్ ఆక్సిమీటర్‌తో చెక్ చేసుకుంటూ, దాని విలువ 95కంటే తక్కువుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చివరిగా అందరికీ చెప్పేదొక్కటే.. ‘ఆందోళన పడకండి.. అప్రమత్తంగా ఉండండి’.
రీ–ఇన్ఫెక్షన్‌తో ప్రమాదం లేదు
హాంకాంగ్‌లో రెండోసారి రీ–ఇన్ఫెక్షన్ వస్తోందంటున్నారు. తెలంగాణలోనూ ఒకటి రెండు కేసులువచ్చాయి. ఇక్కడ గమనించాల్సింది.. మొదటిసారి కరోనా వైరస్ సోకడం వల్ల కోవిడ్–19 అనే వ్యాధి వస్తుంది. కానీ రెండోసారి వైరస్ సోకినప్పటికీ కోవిడ్‌గానీ లేదా ఇతరత్రా ఎలాంటి వ్యాధీ రాదు. రెండోసారి వైరస్ సోకడం వల్ల కోవిడ్ వస్తుందన్నది అపోహే.
Comments
Please login to add a commentAdd a comment