న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజు 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తుండగానే 18 లక్షలు దాటేసింది. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 11.86 లక్షలకు చేరింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 52,972 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజులో 771 మంది బాధితులు కన్నుమూశారు.
దేశంలో ఇప్పటిదాకా మొత్తం కేసులు 18,03,695కు, మరణాలు 38,135కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలియజేసింది. ప్రస్తుతం 5,79,357 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 11,86,203 మంది చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 65.77 శాతం, మరణాల రేటు 2.11 శాతంగా నమోదైంది. ఇలా ఉండగా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై రెండు, మూడో దశల హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించేందుకు డీసీజీఐ అనుమతించింది.
యడ్యూరప్ప కుమార్తెకు కరోనా: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమార్తెల్లో ఒకరు కరోనా వైరస్ బారినపడ్డారు. యడ్యూరప్పకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ముందు జాగ్రత్త చర్యగా వారంపాటు హోం క్వారంటైన్‌లో ఉంటానని యడ్యూరప్ప తనయుడు విజయేంద్ర ట్వీట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. కేంద్ర ఐటీ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment