Hyderabad: కొత్త పుంతలు తొక్కుతున్న సిటీ కల్చర్‌ | gated culture in hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: కొత్త పుంతలు తొక్కుతున్న సిటీ కల్చర్‌

Published Sun, Jul 21 2024 10:57 AM | Last Updated on Sun, Jul 21 2024 10:57 AM

gated culture in hyderabad

సెక్యూరిటీ నుంచి సెలబ్రేషన్స్‌ వరకూ పోటా పోటీ

డ్రోన్‌ కెమెరాలు, బయోమెట్రిక్‌తో భద్రతా ఏర్పాట్లు

ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌  సిస్టమ్స్‌ ఏర్పాటు 

నగరంలోని గేటెడ్‌ కమ్యూనిటీలు చిన్నపాటి అందమైన ఊళ్లను తలపిస్తున్నాయి. వీటి నిర్వహణా వ్యవస్థల మధ్య ఏర్పడుతున్న ఆరోగ్యకరమైన పోటీ సిటీలో వేళ్లూనుకున్న గేటెడ్‌ కల్చర్‌కు కొత్త రంగులు అద్దుతోంది. అయామ్‌ ఫ్రమ్‌ హైదరాబాద్‌ అని చెప్పుకున్నంత గర్వంగా ఐయామ్‌ బిలాంగ్స్‌ టు పలానా కమ్యూనిటీ అని చెప్పుకునేలా నిర్వహణ కాంతులీనుతోంది.

బండ్లగూడలోని కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌లో గణేశుడి లడ్డూ వేలంలో రూ.1.26 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. కరోనా టైమ్‌లో కోకాపేట్‌లోని రాజపుష్పా ఆట్రియా రికార్డ్‌ స్థాయిలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్స్‌ అద్భుతంగా నిర్వహించి తమ కమ్యూనిటీని కరోనా కేసుల్లో జీరోకి చేర్చారు. వందల సంఖ్యలో కుటుంబాలు నివసించే గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఉట్టిప డుతున్న ఐక్యతకే కాదు నిర్వహణా సామర్థ్యానికి కూడా ఇవి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.

సెక్యూరిటీలో హై‘టెక్‌’.. 
సీసీ టీవీలు, కెమెరాలు అనేవి ప్రతి కమ్యూనిటీలో ఇప్పుడు సర్వసాధారణం. కాగా బయోమెట్రిక్‌ ఫేస్‌ రికగ్నైజేషన్‌ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నివాసితుల భద్రతకు భరోసా ఇస్తున్నారు. ఇక అత్యంత సుశిక్షితులైన సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుంటున్నారు. టోల్‌ గేట్‌ తరహాలో ప్రతి వాహనానికీ ఒక ఆర్‌ఎఫ్‌ఐడీ ఇస్తున్నారు. ఆ ఐడీ ఉన్న వాహనం వస్తేనే గేట్‌ ఓపెన్‌ అవుతుంది. ప్రతి గంటకూ ఒకసారి డ్రోన్స్‌తో తనిఖీలు చేసేందుకు త్వరలోనే ఏర్పాట్లు చేయనున్నామని ఓ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రతినిధి చెప్పడం ప్రస్తావనార్హం.

నిర్వహణలో నీట్‌గా.. 
వసతులు కలి్పంచడంలో మాత్రమే కాదు మెయిన్‌టెనెన్స్‌ వసూళ్లలో సైతం కమ్యూనిటీలు పోటీపడుతున్నాయి. గత నాలుగేళ్లలో సిబ్బందికి ఏటా పది శాతం జీతాలు పెంచుతూనే, నివాసితులకు మాత్రం నిర్వహణా వ్యయం రూపాయి కూడా పెంచకుండా మియాపూర్‌లోని ఎస్‌ఎంఆర్‌ వినయ్‌ సిటీ గేటెడ్‌ కమ్యూనిటీల నిర్వహణ చరిత్రలో కొత్త రికార్డ్‌ సృష్టించింది. మరోవైపు కమ్యూనిటీ పరిధిలో నాలుగేళ్లలో 70కి పైగా సీసీటీవీలు ఏర్పాటు చేయడం ద్వారా నివాసితుల భద్రత పటిష్టంగా మార్చారు.  నివాసితుల సమస్యల పరిష్కారానికి బ్లాక్స్‌ వారీగా ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేశారు. బిల్డర్‌ నిర్ణయించిన మెయిన్‌టెనెన్స్‌ ఛార్జీలను కమ్యూనిటీ, ఇతరత్రా ఆదాయ మార్గాలు ద్వారా తగ్గించుకుంటున్నాయి.  

అభివృద్ధి కోసం సమావేశాలు
వినాయకచవితి మొదలుకుని దాదాపు అన్ని కుల మతాలకు చెందిన పండుగలనూ ఘనంగా నిర్వహిస్తూనే, వరల్డ్‌ కప్‌ విజయం లాంటి అపురూప సందర్భాలకూ అప్పటికప్పుడు స్పందిస్తూ కార్య క్రమాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి నుంచి 
సంవత్సరారంభం దాకా కాదేదీ సెలబ్రేషన్‌కి అనర్హం అన్నట్టు గేటెట్‌ కమ్యూనిటీలు సందడి చేస్తున్నాయి. నల్లగండ్లలోని అపర్ణ సైబర్‌ కమ్యూన్‌లో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా 5వేల లాంతర్లతో సంబరాలు చేశారు. నానక్‌రామ్‌గూడలోని మై హోమ్‌ విహంగలో అన్నదానాలు నిర్వహించారు. ఇక డ్రగ్స్, సైబర్‌ నేరాలు తదితర అంశాల మీద అవగాహన, యోగ, ధ్యానంపై శిక్షణా కార్యక్రమాలు రోజువారీగా జరుగుతున్నాయి.  

ఆరోగ్యంపై శ్రద్ధ పెంచిన కరోనా... 
ఆధునిక వసతుల్లో పోటీపడుతున్న గేటెడ్‌ కమిటీలన్నీ సంపూర్ణంగా ఆరోగ్యసేవలపై శ్రద్ధ పెట్టేలా చేసిన ఘనత కరోనాదే. మహమ్మారి విజృంభణ సమయంలో ఈ కమిటీలన్నీ బలోపేతం అవడమే కాకుండా వ్యాక్సినేషన్, శానిటైజేషన్‌ వంటి అంశాల్లో పోటీ.. వంటివి గేటెడ్‌ కమ్యూనిటీలను శక్తివంతగా మార్చాయి. ఆక్సిజన్‌ ప్లాంట్లు, అంబులెన్స్‌లూ ఏర్పాటు చేసుకున్నారు. ఒంటరి వృద్ధుల కోసం 14 ఆస్పత్రులతో, డయాగ్నసిస్‌ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని, అలాగే క్లినిక్, ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నామని గ్రీన్‌ గ్రేస్‌ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రతినిధి బద్రీనాథ్‌ చెప్పడం గమనార్హం.

ప్రోత్సహిస్తున్నాం.. అవార్డులు ఇస్తున్నాం..
మా పరిధిలో అనేక గేటెడ్‌ కమ్యూనిటీలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. నివాసితులకు అనేక రకాల సేవలు అందిస్తున్నాయి. నిర్వహణలో పోటీ తత్వాన్ని మరింత పెంచడానికి వారి సేవల్ని అభినందించడానికి మేం అవార్డులు ఇస్తున్నాం. తాజాగా పచ్చదనం విషయంలో మే ఫెయిర్‌ విల్లాస్‌కు ఇచ్చాం. ఇందులో ఎకరం స్థలంలో ఫారెస్ట్‌ పెంచారు. అంతేకాక 800, 900 ఏళ్ల నాటి చెట్లను రీలొకేట్‌ చేశారు. అదే విధంగా అత్యాధునిక మోషన్‌ కెమెరాలు వినియోగిస్తున్న ఇని్ఫనిటీ విల్లాస్‌కు బెస్ట్‌ సెక్యూరిటీ అవార్డు ఇచ్చాం. అలాగే వ్యర్థాల రీసైక్లింగ్‌లో అద్భుత పనితీరు కనబరుస్తున్న ముప్పా ఇంద్రప్రస్థకు బెస్ట్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ గుర్తింపుని అందించాం.  
– రమణ, అధ్యక్షులు, తెల్లాపూర్‌ నైబర్‌ హుడ్‌ అసోసియేషన్స్‌

పర్యావరణ హితం.. పురస్కార గ్రహీతలం
‘సాధారణంగా గేటెడ్‌ కమ్యూనిటీలో ఉండే దానికి మించి మా కమ్యూనిటీలో 45 నుంచి 50 శాతం ఎక్కువ పచ్చదనం ఉన్నట్టు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్స్‌ (ఐజీబీసీ) గుర్తింపుని ఇచి్చంది’ అని చెప్పారు ఖాజాగూడ నుంచి నానక్‌రామ్‌ గూడ వైపు వెళ్లే దారిలోని చౌరస్తాలో ఉన్న గ్రీన్‌ గ్రేస్‌ గేటెడ్‌ కమ్యూనిటీ కి చెందిన బద్రీనా«థ్‌. సోలార్‌ స్ట్రీట్‌ లైట్స్, సోలార్‌ వాటర్‌ హీటర్స్, బాత్‌రూమ్‌ సింకులు తదితరాల నుంచి పోయే వేస్ట్‌ వాటర్‌ని రీసైకిల్‌ చేసి గార్డెనింగ్, కారిడార్స్, రోడ్ల శుభ్రతకు వినియోగిస్తున్నారు. పర్యావరణ హిత కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి గతంలో తాము కట్టిన రూ.10  లక్షలు నీటి బిల్లులకు డిపాజిట్‌గా మారి గత 45 నెలల నుంచి మాకు నీటి బిల్లు కట్టే అవసరం లేకుండా పోయిందని చెబుతున్నారు. అంతే కాక ఐజీబీసీ గుర్తింపు వల్ల ఆస్తి  
పన్నులో 20 శాతం రిబేటు కూడా సాధించగలిగామని చెప్పారు. ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు ఉన్న తొలి గేటెడ్‌ కమ్యూనిటీ తమదేనని డ్రగ్స్, సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆటోమేటిక్‌ రెస్క్యూ డివైజెస్‌ వల్ల కరెంట్‌ పోయినా లిఫ్ట్‌ మధ్యలో ఆగకుండా మరో ఫ్లోర్‌ దాకా వెళ్లి ఆగి డోర్‌ తెరుచుకుంటుంది. ఇలాంటి ఎన్నో పకడ్బందీ ఏర్పాట్ల ద్వారా నివాసితులకు మేలు చేయడంతో పాటు పురస్కారాలెన్నో అందుకున్నాం.  
– బద్రీనాధ్, గ్రీన్‌ గ్రేస్‌ కమ్యూనిటీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement