సాక్షి, హైదరాబాద్: నేరేడ్‌మెట్‌లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. 782 ఓట్లతో టీఆర్‌ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. ఇతర గుర్తులున్న 544 ఓట్లలో టీఆర్ఎస్‌కు 278 ఓట్లు వచ్చాయి. తాజా విజయంతో జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. తమ పార్టీ అభ్యర్ధి విజయంతో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోగా, బీజేపీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు.
బీజేపీ ఆందోళన
నేరెడ్‌మెట్ కౌంటింగ్ కేంద్రం వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తిరస్కరణకు గురైన 1300 ఓట్లు లెక్కించాలని బీజేపీ అభ్యర్థి ప్రసన్ననాయుడు డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని, అధికార పార్టీకి ఎన్నికల అధికారులు అనుకూలంగా వ్యవహరించి 600కుపైగా చెల్లని ఓట్లను టీఆర్‌ఎస్ ఖాతాలో వేశారని ప్రసన్ననాయుడు ఇంతకుముందు ఆరోపించిన సంగతి తెలిసిందే.
8 గంటలకు మొదలైన కౌంటింగ్
కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకొని లెక్కించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించింది. ఇదిలావుంటే, జీహెచ్ఎంసీ కౌంటింగ్ సమయంలో స్వస్తిక్ కాకుండా ఇతర ముద్రలతో కూడిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. బీజేపీ ఈ నెల 4న హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఎన్నికల సంఘం వాదనలతో ఏకీభవించింది. దీంతో స్వస్తిక్‌తో పాటు ఇతర ముద్రతో ఉన్న ఓట్లను పరిగణలోకి తీసుకోవాంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇతర ముద్ర ఉన్న మరో 544 ఓట్లను లెక్కించిన తర్వాత నేరేడ్‌మెట్ ఫలితం ప్రకటించనున్నారు. కాగా, ఇప్పటికే టీఆర్‌ఎస్ అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment