ఆదివారం భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
గోదారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఏజెన్సీని అతలాకుతలం చేస్తోంది. రహదారులపైకి వరద నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు వంద గ్రామాలకు రవాణా స్తంభించింది. పంటలను వరద ముంచెత్తుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుతోంది. ఆదివారం ఉదయం నుంచి గంటగంటకూ గోదావరి పెరుగుతుండటంతో పరీవాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
బూర్గంపాడు/చర్ల: భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలు గోదావరి వరదలకు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. గ్రామాల్లోకి వరదనీరు చేరుతుండటంతో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వరద ముంపు ప్రాంతాలలో పర్యటిస్తూ బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
అప్రమత్తమైన అధికారులు
జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలపై దృష్టి పెట్టింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కలెక్టర్ ఎంవీ రెడ్డితో కలిసి భద్రాచలంలో వరద పరిస్థితిని సమీక్షించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు బాధితులను పునరావాసకేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కలెక్టర్, అదనపు కలెక్టర్లు కర్నాటి వెంకటేశ్వర్లు, అనుదీప్, భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్‌లు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
కేంద్ర జల సంఘం హెచ్చరికలు
భద్రాచలంలో అర్ధరాత్రి వరకు నీటిమట్టం ప్రమాదస్థాయిని దాటవచ్చని కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. సహాయక చర్యల కోసం రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. సహాయక చర్యల కోసం 040 423450624 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాల వల్ల కూడా వరద ప్రవాహం అధికమైందని, గతంలో 1986 ఆగస్టు 16న ఇదే రోజు గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహించిందని పేర్కొంది.
స్తంభించిన రహదారులు
♦ దుమ్ముగూడెం: గంగోలు–లక్ష్మీనగరం, తూరుబాక–కన్నాయిగూడెం, తూరుబాక–నర్సాపురం, పర్నశాల క్రాస్‌రోడ్–పర్నశాల గ్రామాల మధ్య ప్రధాన రహదార్ల పైకి వరదనీరు చేరింది. ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న సున్నంబట్టి గ్రామంలోని 120 కుటుంబాలను మంగువాయిబాడువా ఆశ్రమ పాఠశాల పునరావాస కేంద్రానికి తరలించారు. గంగోలు డబుల్‌బెడ్ రూం ఇళ్లలో ఉన్న 45 కుటుంబాల వారిని లక్ష్మీనగరంలోని రేగుబల్లి ఆశ్రమ బాలికల పాఠశాలకు తరలించారు.
♦ చర్ల: దేవరాపల్లి–కుదునూరు, దుండుపేట–గుంపెన్నగూడెం, వీరాపురం–జీపీపల్లి, ఎదిరగుట్టలు–సుబ్బంపేట గ్రామాల్లోని ప్రధాన రహదార్లను వరదనీరు ముంచెత్తింది. దండుపేటలోని 23 కుటుంబాలను చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.
♦బూర్గంపాడు: బూర్గంపాడు–నాగినేనిప్రోలు, నాగినేనిప్రోలు–సారపాకల మధ్య రాష్ట్రీయ రహదారిపైకి భారీగా వరదనీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
వేలాది ఎకరాల్లో పంట నీటమునక
గోదావరి వరదలకు భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని ఏడు మండలాల్లో సుమారు 8వేల ఎకరాల పంటలు నీటమునిగాయి. వరి, పత్తి పంటలు, కూరగాయ తోటలు నీటి పాలయ్యాయి. పినపాక మండలంలో సుమారు పదిహేను వందల ఎకరాల పంట నీటమునిగింది. మణుగూరు మండలంలో మూడువందల ఎకరాల్లో వరి, రెండు వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. అశ్వాపురం మండలంలో ఐదువందల ఎకరాల్లో పత్తి, మరో వేయి ఎకరాల్లో వరి నీటమునిగింది. బూర్గంపాడు మండలంలో పదిహేను వందల ఎకరాల్లో వరి, వేయి ఎకరాల్లో పత్తి నీటమునిగాయి. దుమ్ముగూడెంలో 650 ఎకరాలు, చర్లలో 700 ఎకరాల్లో పంట నీటమునిగింది. కాపుదశలో ఉన్న పత్తి పంట గోదారి వరదలకు మునిగిపోవటంతో రైతులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
వరద వచ్చేదిలా...
♦ సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌తోపాటు ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి..
♦ తూరుబాకవాగు, గుబ్బలమంగి, తాలిపేరు, పాలెంవాగు, గుండ్లవాగు, చీకుపల్లివాగు, లొట్టిపిట్లటగండి తదితర వాగుల నుంచి..
♦కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్ట్ నుంచి 9 లక్షల 70 క్యూసెక్కులు,
♦తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి 1,58,472 క్యూసెక్కులు ఇంద్రావతి నది నుంచి కూడా భారీగా వరదనీరు వస్తోంది.
♦కిన్నెరసాని నుంచి విడుదల చేస్తున్న 45 క్యూసెక్కుల నీరు భద్రాచలం దిగువన గోదావరిలో కలుస్తోంది.
ప్రమాద హెచ్చరికలు..
నాలుగు రోజులుగా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. శనివారం తెల్లవారుజామున 3.50 గంటలకు నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆదివారం ఉదయం 5 గంటలకు 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం 1.50 గంటలకు 53 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment