హైదరాబాద్‌లో గోల్డ్‌ ఏటీఎం వచ్చేసింది.. దేశంలోనే తొలిసారి | Goldsikka: World First Real Time Gold ATM in Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: గోల్డ్‌ ఏటీఎం వచ్చేసింది.. దేశంలోనే తొలిసారి

Published Sun, Dec 4 2022 1:31 AM | Last Updated on Sun, Dec 4 2022 3:59 PM

Goldsikka: World First Real Time Gold ATM in Hyderabad - Sakshi

గోల్డ్‌ ఏటీఎంను ప్రారంభిస్తున్న సునీతా లక్ష్మారెడ్డి 

సనత్‌నగర్‌: నగదు ఉపసంహరణ, జమకు ఉపయోగించే ఏటీఎంల తరహాలోనే డెబిట్, క్రెడిట్‌ కార్డులతో బంగారం విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా గోల్డ్‌ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్‌ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్‌లో గల ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటైన ఈ ఏటీఎంను శనివారం రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీ­తా లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్‌ ఏటీఎం నిదర్శనమన్నారు. బంగారాన్ని తీసుకునేందుకు దేశంలోనే తొలిసారి గోల్డ్‌ ఏటీఎంను నగరంలో ప్రారంభించడాన్ని ఆమె అభినందించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఈ గోల్డ్‌ ఏటీఎంలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

ఈ తరహా ఏటీఎంలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకివస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గోల్డ్‌ సిక్కా సంస్థ సీఈఓ సయ్యద్‌ తరుజ్‌ మాట్లాడుతూ...ఈ గోల్డ్‌ ఏటీఎం ద్వారా 99.99% నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను విత్‌ డ్రా చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం డెబిట్, క్రెడిట్‌ కార్డులతో పాటు తాము జారీ చేసే ప్రీపెయిడ్‌ కార్డులనూ ఉపయోగించవచ్చన్నా రు. ఒక్కో మిషన్‌లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల పసిడిని లోడ్‌ చేయవచ్చన్నారు. భారత్‌లో గోల్డ్‌ మార్కెట్‌ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్‌ తీసుకోవచ్చని తెలిపారు.  

త్వరలోనే మరిన్ని గోల్డ్‌ ఏటీఎంల ఏర్పాటు... 
త్వరలోనే ఎయిర్‌పోర్ట్, పాతబస్తీలో మూడు ఏటీఎంలు, సికింద్రాబాద్, అబిడ్స్‌లతో పాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్‌లలో కూడా గోల్డ్‌ ఏటీఎంలను ప్రారంభించనున్నామని చెప్పారు. రానున్న రెండేళ్లల్లో దేశవ్యాప్తంగా 3,000 యంత్రాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వివరించారు.

కార్యక్రమంలో వ్యాపార వ్యవస్థాపకుడు బండారి లక్ష్మారెడ్డి, దర్శకుడు నరసింహారావు, టీ–హబ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఎం.శ్రీనివాసరావు, తెలంగాణ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ అధ్యక్షుడు కొండూరు రవీందర్‌రావు, అక్రితి గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ కుల్దీప్‌ రైజాదా, తెలంగాణ జియో సీఈఓ కేసీ రెడ్డి, గోల్డ్‌ సిక్కా సంస్థ చైర్‌పర్సన్‌ అంబిక బుర్మన్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement