ఆడియో పుస్తకాలు, ఈ–బుక్స్, ట్యాబ్స్ అలాంటి అనుభూతిని ఇవ్వలేవు
రచయితకు, పాఠకుడికి మధ్య అనుబంధమే పుస్తకం
పెళ్లిళ్లు, వేడుకల్లో పుస్తకం బహుమతిగా ఇవ్వండి
హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సాక్షి, హైదరాబాద్: రచయితకు, పాఠకుడికి మధ్య ఒక అనిర్వచనీయమైన అనుబంధాన్ని ముడివేసేది పుస్తకమేనని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. చేతుల్లో పుస్తకాన్ని పట్టుకొని చదివినప్పుడు మాత్రమే నిజమైన పుస్తక పఠన అనుభూతిని ఆస్వాదించగలమని చెప్పారు. పాఠకుడు, రచయిత కలిసి సంభాషించుకుంటున్నట్లుగా ఉంటుందన్నారు. ఆడియో పుస్తకాలు, ఈ–బుక్స్, ట్యాబ్స్, కంఫ్యూటర్లు అలాంటి అనుభూతిని ఇవ్వలేవని, అవి కేవలం మిషన్లు మాత్రమేనని పేర్కొన్నారు.
గవర్నర్ శనివారం హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. పుస్తకమే జ్ఞానం, పుస్తకాన్ని మించిన గొప్ప సహచర్యం మరొకటి లేదని గవర్నర్ చెప్పారు. మానవ నాగరికతా పరిణామం, మహోన్నతమైన భారతీయ సాంస్కృతిక జీవన విధానం, వేదాలు, ఉపనిషత్తులు తదితర సాహిత్యమంతా పుస్తకంలోనే నిక్షిప్తమై ఉందన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ పుస్తకాన్ని ఏమాత్రం భర్తీ చేయలేదన్నారు. కాలనీలు, బస్తీల్లో కమ్యూనిటీ లైబ్రరీలను విరివిగా ప్రోత్సహించాలని సూచించారు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో జాతీయ స్థాయిలో అద్భుతమైన పుస్తక ప్రదర్శనలు జరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
పుస్తకం బహుమతిగా ఇవ్వండి
సభలు, సమావేశాలు, వేడుకల్లో పుష్పగుచ్ఛాలకు బదులు పుస్తకాలను బహుమతిగా ఇచ్చే సంప్రదాయాన్ని పాటించాలని గవర్న ర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. పెళ్లిళ్లు, పండుగల్లోనూ పుస్తకాలు బహుమతిగా ఇవ్వడం ద్వారా మంచి పుస్తక పఠనాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. పుస్తక ప్రదర్శనను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. పుస్తకాలు ప్రతి ఒక్కరూ చదవాలని, చదివించాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుక్ డొనేషన్ బాక్స్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. దాతల నుంచి సేకరించిన పుస్తకాలను గ్రామాల్లోని గ్రంథా లయాలకు, విద్యార్థులకు అందజేసేందుకు బుక్ ఫెయిర్ కమిటీ ఈ బాక్సును ఏర్పాటు చేసింది. తెలంగాణ సాంస్కృతిక శాఖ, గ్రంథాలయ సంస్థ, అక్షరయాన్ తదితర స్టాళ్లను గవర్నర్ ఆసక్తిగా సందర్శించారు.
ఈ కార్య క్రమానికి అధ్యక్షత వహించిన హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కమిటీ అధ్యక్షుడు, కవి యాకు బ్ మాట్లాడుతూ.. పుస్తక ప్రదర్శన విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థల చైర్మన్ రియాజ్, బుక్‌ఫెయిర్ కమిటీ ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment