హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ప్రజల స్నేహాభిమానాలు, కవిత్వానికి హైదరాబాద్ ప్రతీక
‘సిటీ ఆఫ్ డిస్కవరీ’గా నిలిచినందునే వేగంగా అభివృద్ధి
త్వరలో ఈశాన్య భారతం–హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: సమాజం పురోగతి సాధించాలంటే సాహిత్యం, కళల అవసరం ఎంతైనా ఉందని గవర్నర్ డాక్టర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. ఇవి చిరస్థాయిగా నిలిచిపోతాయని, సాహిత్యం, పుస్తకాలనేవి అంతర్థానం కావని తాను బలంగా విశ్వసిస్తున్నా నని చెప్పారు. అచ్చయిన పుస్తకం ద్వారా సాహి త్యం ఓ రిజర్వాయర్‌గా నిలిచి అవసరానికి అక్కరకు వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. సాహిత్యం, కళలు అనేవి లేకుండా జీవితం పరిపూర్ణం కాదన్నారు.
డిజిటల్ పద్ధతిలో, ఆడియో బుక్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో అయినా పుస్తకాలు చదవడం మంచిదేనని పేర్కొన్నారు. తనకు మాత్రం సంప్రదాయ పద్ధతుల్లో పుస్తకాన్ని చేతబూని చదవడాన్ని మించిన అనుభూతి మరొకటి లేదన్నారు. పుస్తకం చదవడం ద్వారా నేరుగా రచయితతో సంభాషిస్తున్నట్టు ఉంటుందని చెప్పారు. శుక్రవారం సత్వ నాలెడ్జి సిటీలో ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్–2025’ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
కళలు, సంస్కృతి, సాహిత్యాల సంగమం
‘పెద్ద పెద్ద భవనాలు, కట్టడాలకే కాదు ప్రజల స్నేహాభిమానాలు, కవిత్వానికి హైదరాబాద్ ప్రతీక. ‘సిటీ ఆఫ్ డిస్కవరీ’గా నిలిచినందునే నగరం అభివృద్ధి చెందుతోంది. హైద రాబాదీలు సాహిత్యం, కవిత్వంతో మమేకమై ఉన్నారు. కళలు, సంస్కృతి, సాహిత్యాల సంగమంగా హైదరాబాద్ సాహిత్యోత్సవం (లిటరరీ ఫెస్టివల్) నిలుస్తోంది. త్రిపురకు చెందిన నాకు.. తాత, తల్లి చిత్రకారులు కావడంతో కళలు, సాహిత్యంపై అభిమానం పెరిగింది. కళలు, సాహిత్యం అనేవి సృజనాత్మక స్ఫూర్తితో జీవితానికి పరిపూర్ణతను అందిస్తాయి. పుస్తకం ద్వారా మనల్ని మనం తెలుసుకోవడంతో పాటు ప్రపంచాన్ని కూడా కనుక్కోవచ్చు.
ఇటీవలి కాలంలో పుస్తకాల పఠనం తగ్గిపోయిందని, తమ పుస్తకాలు అమ్ముడుపోవడం లేదంటూ హైదరాబాద్ బుక్ ఫెయిర్ సందర్భంగా రచయితలు వాపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వివాహ వార్షికోత్సవాలు, పిల్లల పుట్టినరోజులు, ఇలా వివిధ సందర్భాల్లో పుస్తకాలను బహుమతులుగా ఇవ్వొచ్చునని సూచించా. ‘ఏక్ భారత్–శ్రేష్ట్ భారత్’స్ఫూర్తితో త్వరలో రాజ్‌భవన్‌లో ‘ఈశాన్య భారత్–హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’నిర్వహిస్తాం..’అని గవర్నర్ తెలిపారు.
ఆ విషయంలో పెద్దలదే బాధ్యత: షబానా అజ్మీ
సీనియర్ నటి షబానా అజ్మీ మాట్లాడుతూ..‘స్మార్ట్‌ఫోన్లు, టాబ్‌లు, ఇతర డిజిటల్ పరికరాలకు పిల్లలు అతుక్కుపోతున్నారు. అయితే వారు పుస్తకాలు చదివే అలవాటు మరవడానికి పెద్దలదే బాధ్యత అని నేను నమ్ముతా. పెద్దవారు పుస్తకాలను చదివే అలవాటును మరిచిపోతే ఇక పిల్లలేం చేస్తారు. పెద్దలు నాటకాలు చూడడానికి, సాహిత్య సభలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, కళా ఉత్సవాలకు వెళ్లకపోతే ఇక పిల్లలకేం అలవడుతుంది..’అని వ్యాఖ్యానించారు.
పుస్తకమనేది భాషను పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు. ‘హైదరాబాద్ అంటే నాకెంతో అభిమానం. ఇక్కడ ప్రగతిశీల రచయితల సమావేశంలోనే నా తల్లిని నా తండ్రి ఖైఫీ అజ్మీ కలుసుకున్నారు. మఖ్దూం మొహియుద్దిన్, సర్వర్ డండా, పుష్యమిత్ర ఇతర ప్రగతిశీల, విప్లవ కవులకు కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది..’అని పేర్కొన్నారు. ఫెస్టివల్ కమిటీ చైర్‌గా పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అమితాదేశాయ్, డాక్టర్ టి.విజయ్‌కుమార్, డాక్టర్ కిన్నెర మూర్తి తదితరులు పాల్గొన్నారు.
‘సాగర సంగమం’గుర్తు చేసుకున్న లిథువేనియా రాయబారి
తాను భారతీయ సినిమాలు చూస్తూ పెరిగినట్లు గౌరవ అతిథి, లిథువేనియా రాయబారి డయానా మికెవిసీన్ చెప్పా రు. భారతీయ భాషలకు పెద్ద అభిమానినని, సంస్కృతం, హిందీ నేర్చుకుంటున్నానని తెలిపారు. 1999లో విద్యారి్థనిగా, 2023లో మరోసారి హైదరాబాద్‌ను సందర్శించానన్నా రు. నయా భారత్‌కు చిహ్నంగా ఈ నగరం నిలుస్తోందంటూ ప్రశంసించారు. తాను వృత్తిగతంగా రాయబారినైనా చాలా పుస్తకాలు చదువుతానన్నారు.భారత్‌పై పుస్తకం రాయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ‘సాగర సంగమం’సినిమాను అందులోని ‘మౌనమేలనోయి..’పాటను డయానా గుర్తుచేసుకోగా ఆహూతులు చప్పట్లతో హర్షం వెలిబుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment