సమస్యలుంటే నాకు చెప్పండి | Governor Tamil Sai Arrange Complaint Box In Front Of Raj Bhavan Telangana | Sakshi
Sakshi News home page

సమస్యలుంటే నాకు చెప్పండి

Published Sun, Jan 2 2022 2:18 AM | Last Updated on Sun, Jan 2 2022 8:33 AM

Governor Tamil Sai Arrange Complaint Box In Front Of Raj Bhavan Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం మధ్య వారధిగా ఉండేందుకు జనం నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వెల్లడించారు. వ్యక్తిగత సమస్యలపై వచ్చే అర్జీలను పరిష్కరించేందుకు దాతల సాయం తీసుకుంటామన్నారు. రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజలను స్వయంగా కలుసుకుంటానని, వారి సమస్యలను వినడంతో పాటు అర్జీలను స్వీకరించి ప్రభుత్వ శాఖల సహకా రంతో పరిష్కారానికి కృషి చేస్తానని గవర్నర్‌ గతం లో ప్రకటించిన విషయం తెలిసిందే.

దీనికి ఏర్పా ట్లను సైతం గతంలో చేసుకున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి వాటి పరిష్కారంలో పురోగతిని సమీక్షించడానికి అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన చేశారు. కరోనా వ్యాప్తితో అప్పట్లో ఈ కార్యక్రమాన్ని గవర్నర్‌ ప్రారంభించలేకపోయారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజాదర్బార్‌కు బదులు డ్రాప్‌ బాక్స్‌ (ఫిర్యాదుల పెట్టె్ట) ద్వారా సామాన్య ప్రజల నుంచి విన్నపాలు, సలహాలు గవర్నర్‌ స్వీకరించనున్నారు. రాజ్‌భవన్‌ బయట ప్రవేశ ద్వారం వద్ద డ్రాప్‌ బాక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపించడంతో పాటు వాటి పరిష్కారానికి రాజ్‌భవన్‌ కృషిచేస్తుందని వెల్లడించారు. 

రాజ్‌భవన్‌ పరివార్‌ సభ్యుల కోసం...
రాజ్‌భవన్‌ పరివార్‌ సభ్యుల నుంచి అర్జీలను స్వీక రించేందుకు లోపల మరో డ్రాప్‌ బాక్స్‌ ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా శని వారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమం లో ఆమె ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 21 మంది దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. సేవా ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ ల్యాప్‌టాప్‌ లను విరాళంగా అందజేసింది. అనంతరం డ్రాప్‌ బాక్స్‌లను ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో 100 శాతం తొలి డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేసినందుకు ప్రభుత్వాన్ని, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ప్రశంసించారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసు కోవాలని ప్రజలకు సూచించారు. పాశ్చాత్య ఆహార అలవాట్లకు దూరంగా ఉండాలని, సంప్రదాయ ఆహారాన్ని స్వీకరించాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement