
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీ ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన చర్చల్లో గవర్నర్ బహిరంగంగా పాల్గొంటున్నారని టీఆర్‌ఎస్ నేత వై.సతీశ్ రెడ్డి ఆరోపణలు చేశారు. రాజకీయంగా తటస్థంగా ఉండాల్సిన గవర్నర్ పదవికి కళంకం తీసుకువచ్చారని విమర్శలు చేశారు. ‘2024 ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీ వ్యూహం’అనే అంశంపై తమిళనాడు బీజేపీకి చెందిన వ్యక్తులు శుక్రవారం ‘ట్విట్టర్ స్పేస్’వేదికగా నిర్వహించిన చర్చలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారని ఆరోపించారు.
ఈ చర్చలో పాల్గొన్న వారి జాబితాలో గవర్నర్ తమిళిసై అధికారిక ట్విట్టర్ ఖాతా సైతం ఉందని టీఆర్‌ఎస్ చెబుతోంది. కాగా, ఈ ఆరోపణలు నిరాధారమైనవని శనివారం రాజ్‌భవన్ తోసిపుచ్చింది. గవర్నర్ రాజకీయపార్టీ నిర్వహించిన చర్చలో పాల్గొన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజ్‌భవన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొంది.