
సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన సమరయోధుల వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత యువతపై ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. కేంద్ర యువజన సర్విసులు, క్రీడల శాఖ, నెహ్రూ యువకేంద్ర సంఘటన్, సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్ సంయుక్తంగా శుక్రవారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ‘మేరీ మాటి–మేరా దేశ్’ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. గవర్నర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో యోధులు ప్రాణాలను త్యజించారని కొనియాడారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వాలంటీర్లు తీసుకువ చ్చిన మట్టి నమూనాలను గవర్నర్ పరిశీలించారు. కార్యక్రమంలో సౌత్‌జోన్ సీఆర్‌పీఎఫ్ ఏడీజీ రవిదీప్ సింగ్ షాహి, ఐజీ చారూసిన్హా, డీఐజీపీ ఉదయ్‌భాస్కర్, ఎన్‌వైకేఎస్ రాష్ట్ర సంచాలకులు ఏఆర్ విజయ్‌రావు, కుష్బు గుప్తా పాల్గొన్నారు.