టార్గెట్‌ శ్రీనివాస్‌రెడ్డా..?లేక రాఘవేందర్‌రెడ్డా..? | Gun Fire Ibrahimpatnam Rangareddy District | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ శ్రీనివాస్‌రెడ్డా..?లేక రాఘవేందర్‌రెడ్డా..?

Published Thu, Mar 3 2022 9:07 AM | Last Updated on Thu, Mar 3 2022 12:46 PM

Gun Fire Ibrahimpatnam Rangareddy District - Sakshi

హైదరాబాద్‌/ఇబ్రహీంపట్నం : సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ హత్యలో ఏడెనిమిది మంది హంతకులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు కారు, ద్విచక్ర వాహనంపై  వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి దగ్గర్లోనే పెట్రోల్‌ బంక్‌ ఉండటంతో అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితులు, వాహనాల రాకపోకలు ఏమైనా నిక్షిప్తమయ్యాయా? అనేదానిని పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగుల కాల్పుల్లో అల్మాస్‌గూడకు చెందిన నవారు శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్‌ఎన్‌ రెడ్డి నగర్‌ ద్వారకామయినగర్‌ కాలనీకి చెందిన కోమటిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి మృతి చెందడంతో.. కేసు ఛేదనలో పోలీసులు పూర్తిగా సాంకేతిక అంశాలపై ఆధారపడాల్సి వచ్చింది. సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్, కాల్‌ డేటా రికార్డ్‌ (సీడీఆర్‌) ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 

ప్రత్యక్ష సాక్షుల పాత్ర ఉందా? 
► కాల్పులు జరిగిన ఘటనా స్థలానికి అత్యంత చేరువలో 10 నుంచి 15 గుడిసెలు ఉన్నాయి. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారు. వెంచర్‌లోని రోడ్లు, డ్రైనేజీ వర్క్స్, గుంతలు తీయటం వంటి పనులు చేస్తుంటారు. మంగళవారం శివరాత్రి పండగ కావటం, ఉదయం 8 గంటల ప్రాంతంలోనే కాల్పులు జరగడంతో ఆ సమయంలో గుడిసె వాసులు అక్కడే ఉండి ఉంటారని.. అనుమానాస్పద వ్యక్తులు వెంచర్‌లోకి రావటం, తూటాల శబ్దం వంటివి ఏమైనా గమనించారా? కాల్పులను ప్రత్యక్షంగా చూశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

► గుడిసెవాసుల్లోని 20 మంది మహిళలు, పురుషులను పోలీసులు బుధవారం విచారించారు. మంగళవారం శ్రీనివాస్‌ రెడ్డి మృతదేహం వద్ద జాగిలంతో పరిశీలించిన డాగ్‌ స్క్వాడ్‌ను బుధవారం మరోసారి రంగంలోకి దింపారు. ఘటన జరిగిన రోజు నేరుగా ఇబ్రహీంపట్నం రోడ్‌ వైపు పరుగెత్తిన జాగిలం.. బుధవారం మాత్రం మృతదేహం పడిన చోటే తిరిగింది. వెంచర్‌ బయటికి వెళ్లకపోవడం గమనార్హం.  

భూ వివాదాలే కారణం.. కానీ.. 
భూ వివాదాలే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చినప్పటికీ.. ఆ తగాదా కర్ణంగూడలోని 10 ఎకరాల భూమి విషయంలోనా లేక వేరే ఏమైనా భూ తగాదాలా, సెటిల్మెంట్లా? అనేవి తేల్చే పనిలో పోలీసులు పడ్డారు. దీంతో రియల్టర్ల హత్యకు సుపారీ ఎవరు ఇచ్చారనేది పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రతి రోజు ఉదయం శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌ రెడ్డిలు కర్ణంగూడలోని తమ పొలానికి వచ్చి కాసేపు గడుపుతారనే సమాచారం తెలిసిన వ్యక్తే హత్యకు పథకం రచించి ఉంటాడని, అతనే హంతకులకు వారి సమాచారం అందించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  

► శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి రాకముందే హంతకులు అక్కడ కాపు కాస్తున్నా రని తెలిసింది. మృతులు ఇద్దరికీ ఆయుధ లైసెన్స్‌లు లేవని, స్వాధీనం చేసుకున్న బుల్లెట్, షెల్స్‌ ఆధారంగా హంతకులు రెండు తుపాకులు వాడినట్లు పోలీసులు నిర్ధారించారు. లాఅండ్‌ఆర్డర్‌ పోలీసులతోపాటు స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ), సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌), ఇంటలిజెన్స్‌ వంటి ఎనిమిది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. 
స్థిర చరాస్తులపై దర్యాప్తు.. 

► భూ వివాదాలు, సెటిల్మెంట్లే హత్యకు కారణ మని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో స్థిర, చరాస్తులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో రియల్టర్‌ మట్టారెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి డ్రైవర్‌ కృష్ణ, ప్రధాన అనుచరులు హఫీజ్, నవీన్‌లను రెండు రోజుల నుంచి విచారిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డికి నమ్మిన బంటైన కృష్ణ.. చిన్నతనం నుంచి శ్రీనివాస్‌ వెంటే ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు.  

► చర్లపటేల్‌గూడలోని  పదెకరాలు కొనుగోలు చేసిన శ్రీనివాస్‌రెడ్డి.. ఆ భూమిని కృష్ణ పేరు మీదనే డెవలప్‌మెంట్‌కు తీసుకున్నట్లు సమాచారం. ఎప్పుడూ చుట్టూ అనుచరులు, సెక్యూరి టీతో ఉండే శ్రీనివాస్‌రెడ్డిని మీర్‌పేట నయీంగా పిలుస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. 

► పట్నంతో పాటు అబ్దుల్లాపూర్‌మెట్, పెద్ద అంబర్‌పేట, అనాజ్‌పూర్, హయత్‌నగర్‌లో పెద్ద మొత్తంలో  సెటిల్మెంట్లు చేస్తుంటాడని తెలిసింది.  తుర్కయాంజాల్‌లో పెద్ద డీల్‌తో పాటు వనస్థలిపురంలో స్థలంవివాదంపై కోల్‌కతా వెళ్లి సెటిల్మెంట్‌ చేసినట్లు సమాచారం. 

ఉప్పందించిందెవరో..? 
ఇబ్రహీంపట్నం: మండల పరిధిలోని కర్ణంగూడలో మంగళవారం జరిగిన జంట హత్యల కేసు మిస్టరీ వీడలేదు. ఇక్కడ చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఇద్దరు రియల్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. కేసును ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యంగా తమ అనుచరులు లేకుండా శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి సైట్‌ వద్దకు వస్తున్నట్లు దుండగులకు ఎవరు ఉప్పందించారనేది కీలకంగా మారింది. ఈ విషయం తేలితే కేసు మిస్టరీని సులువుగా ఛేదించే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి చెప్పారు. సుపారీ గ్యాంగ్‌ కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.   

స్పెషల్‌ టీంలతో దర్యాప్తు 
జంట హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్‌ఓటీ, ఐటీ సెల్, సీసీఎస్, ఎస్బీ, ఇంటెలిజెన్స్‌ ఇలా వేర్వేరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీంకు లభించిన ఆధారాలు, బుల్లెట్లను పరిశీలిస్తున్నారు. కాల్పులకు వాడిన తుపాకులు, బుల్లెట్లు అక్రమంగా కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. కాల్పులు జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో ఉన్న గుడిసెవాసులను, లేక్‌ విల్లాలో పనిచేస్తున్న కూలీలను పోలీసులు బుధవారం విచారించారు. కాల్పుల శబ్దం వినబడిందా? ఈ గొడవను మీరు చూశారా..? దుండగులను మీరు గుర్తు పట్టగలరా..? అనే కోణంలో వారిని విచారించారు.  

టార్గెట్‌ ఒక్కరేనా..? 
దుండగులు ఒక్కరినే టార్గెట్‌ చేసి వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి ఒకే వాహనంలో ఉండటంతో దుండగులు ఇద్దరినీ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఎవరిని టార్గెట్‌ చేసింది ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు. వీరి లక్ష్యం భూదందా, సెటిల్‌మెంట్‌లలో సిద్ధహస్తుడైన శ్రీనివాస్‌రెడ్డా..? లేక హత్య కేసులో జైలుకెళ్లి వచ్చిన రాఘవేందర్‌రెడ్డా..? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన పాత కేసులను పరిశీలిస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement