హైదరాబాద్: పారిశ్రామికవాడగా పేరు గాంచిన బాలానగర్, ఫతేనగర్ డివిజన్లలోని చిన్న తరహా పరిశ్రమలపై ఆధారపడి వేలాది మంది కారి్మకులు, చిరువ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి పరిశ్రమల్లో ప్రతి ఒక్కరికీ కావాల్సిన వస్తువులు తయారు చేసి ఇస్తుంటారు. దీంతో ఈ ప్రాంతం ఎప్పుడూ జనాలతో బిజీబిజీగా ఉంటుంది. ఇక్కడ పలువురు చిరువ్యాపారులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటారు. అయితే, గతేడాది కరోనా మహమ్మారి చిరువ్యాపారుల జీవనంపై ప్రభావం చూపగా, ఈ ఏడాది సెకండ్ వేవ్‌తో వారి పరిస్థితి దుర్భరంగా మారింది. ఇప్పడు లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో వ్యాపారాలు మొత్తం మూతపడి చిరు వ్యాపారుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఈ ప్రాంతంలో తోపుడు బండ్లపై మొక్కజొన్న పొత్తులు, పుచ్చకాయలు, జామకాయలు, మామిడి పండ్లు, ఖర్జూరం, నిమ్మ షోడాలు వంటివి విక్రయిస్తూ పలువురు జీవిస్తుంటారు.
పెద్ద హోటల్స్ ముందు టీస్టాల్స్, పాన్ డబ్బాలు పెట్టుకొని, పూలు అమ్ముకుంటూ పలువురు జీవిస్తారు. కరోనా ఉధృతి తగ్గడంతో గతేడాది నవంబర్ నుంచి వ్యాపారాలు పుంజుకోవడంతో చిరువ్యాపారుల్లో ఆశలు మొదలయ్యాయి. గత అప్పులను తీర్చి ఎంతో కొంత పొదుపు చేసుకోవచ్చు అని అనుకునే లోపే మహమ్మారి మళ్లీ జడలు విప్పింది. కొనుగోళ్లదారులు లేక వ్యాపారులు ఇరకాటంలో పడ్డారు. రోజు వారీ ఖర్చులు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. రాత్రిపూట కర్ఫ్యూ పెట్టడంతో వలస కారి్మకులు తమ స్వస్థలాలకు తరలి వెళ్లారు. దాంతో వ్యాపారాలు సాగకపోవడంతో తమను ఆదుకొనేది ఎవరు? అని బెంగపెట్టుకున్నారు. తాజాగా, బుధవారం నుంచి లాక్‌డౌన్‌ను అమలు చేయడంతో వ్యాపారాలు మొత్తం మూతపడ్డాయి. దీంతో తమ కుటుంబాలను ఎలా పోషించాలని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలానగర్, ఫతేనగర్ డివిజన్లలో సుమారు 200 మందికి పైగా చిరువ్యాపారులు ఉన్నారు. ప్రభుత్వం నుంచి వీరికి ఎటువంటి సాయం అందడంలేదు. బ్యాంకులు వీరికి లోన్లు కూడా ఇవ్వడంలేదు. ఆపత్కాలంలో చిరువ్యాపారులకు ఆపన్నహస్తం అందించేందుకు దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఒక్కరూ బోణి కొట్టలేదు...
గతేడాది లాక్‌డౌన్‌తో పూట గడవటమే కష్టంగా మారింది. అప్పటి నుంచి సరిగ్గా కోలుకోలేదు. ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే జనం రోడ్లపై తిరగాలని ప్రభుత్వం చెప్పింది. బీదర్ నుంచి వచ్చి నిమ్మకాల సోడా బండి పెట్టుకొని బతుకుతున్నాం. నిన్న, ఈరోజు ఒక్కరు కూడా నా బండి వద్ద సోడా తాగి బోణి చేయలేదు. ఇంకో రెండు వారాలు చేసి ఇక్కడ ఉండాల, ఊరు వెళ్లిపోవాలా అనేది నిర్ణయం తీసుకుంటాం.
–మంజునాథ్, ఫతేనగర్ చిరువ్యాపారి
నెల రోజులుగా వ్యాపారం లేదు
కరోనా తొందరగా తగ్గిపోయి జనం బాగుండుదెప్పుడో అర్థం కావటం లేదు. పండ్లు, సరిగ్గా అమ్మితేనే మా కుటుంబం చక్కగా ఉంటుంది. నెల రోజులుగా సరిగ్గా వ్యాపారంమే లేదు. మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. లేదా ప్రభుత్వం అయినా ఆదుకోవాలి. జహీరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం.
–అనిల్, పుచ్చకాయల వ్యాపారి
Comments
Please login to add a commentAdd a comment