ప్రాణాలకు తెగించి స్నాచర్‌ను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ యాదయ్య
పెనుగులాటలో యాదయ్యను విచక్షణారహితంగా పొడిచిన స్నాచర్
7 కత్తిపోట్లతో తీవ్ర రక్తస్రావమవుతున్నా పట్టువిడవని వైనం
3 సర్జరీలు, వందకుపైగా కుట్లతో బయటపడ్డ పోలీసు
సాక్షి, హైదరాబాద్: ఛాతి, మెడ, కడుపు, చేతుల మీద విచక్షణారహితంగా కత్తిపోట్లు.. రక్తం ఏరులై పారుతున్నా ఏమాత్రం బెదరకుండా కరుడుగట్టిన అంతర్రాష్ట్ర చెయిన్ స్నాచర్ ఇషాన్ నిరంజన్ నీలంనల్లి ఆటకట్టించారు హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్య. అతని ధైర్య సాహసాలను గుర్తించిన కేంద్ర హోం శాఖ అత్యున్నత శౌర్య పతకం రాష్ట్రపతి గ్యాలంటరీ పురస్కారానికి ఎంపిక చేసింది.
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యాదయ్య ఈ అవార్డును అందుకోనున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఈ పతకానికి ఎంపికైన ఏకైక పోలీసు యాదయ్యే కావడం విశేషం. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని మాదాపూర్ సీసీఎస్‌లో యాదయ్య హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. యాదయ్య అవార్డుకు ఎంపికవడంతో ఆయన కుటుంబ సభ్యులు, స్వగ్రామమైన చేవెళ్లలోని మీర్జాగూడలో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
నాడు ఏం జరిగిందంటే..
2022 జూలై 25న చెయిన్ స్నాచింగ్, అక్రమ ఆయుధాల సరఫరాదారులైన ఇషాన్ నిరంజన్ నీలంనల్లి, రాహుల్ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో స్నాచింగ్‌లకు తెగబడ్డారు. కూకట్‌పల్లి, గచ్చిబౌలి, ఆర్సీపురం, మియాపూర్‌లలో వరుస చెయిన్ స్నాచింగ్‌లతో హడలెత్తించారు. దీంతో స్నాచర్లను పట్టుకునేందుకు వెంటనే అప్పటి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
స్నాచర్ల కోసం కమిషనరేట్ పరిధిలోని అన్ని సీసీటీవీ ఫుటేజ్‌లను జల్లెడ పట్టారు. స్నాచింగ్ సమయంలో నిందితులు వినియోగించిన ద్విచక్ర వాహనం, వారు ధరించిన దుస్తులను గుర్తించారు. వీటి ఆధారంగా నిందితుల జాడ కోసం వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో స్నాచర్లు మియాపూర్‌లో మరో స్నాచింగ్ చేసి, బైక్ మీద వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
ఆ సమయంలో మాదాపూర్ సీసీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న యాదయ్య, దేబేష్‌లు బైక్ మీద ఆర్సీపురం నుంచి మియాపూర్ వైపు వస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇరువురు స్నాచర్లను పట్టుకునేందుకు బయలుదేరారు.
రక్తం కారుతున్నా...
నిందితులు అశోక్‌నగర్ హెచ్‌ఐజీ గేట్ నుంచి బీహెచ్‌ఈఎల్ వైపు మళ్లారు. దీంతో కాలనీలోనే స్నాచర్లను పట్టుకోవాలని నిర్ణయించుకున్న యాదయ్య బైక్‌ను హెచ్‌ఐజీ గేట్ లోపలికి మళ్లించారు. కాలనీలో నుంచి బైక్ మీద ఎదురుగా వస్తున్న నిందితులు ఇషాన్, రాహుల్ వీరిని దాటి వెళ్లేందుకు యత్నించారు. దీంతో బైక్ వెనకాల కూర్చున్న కానిస్టేబుల్ దేబేష్ స్నాచర్ రాహుల్‌ను, బైక్ నడుపుతూనే యాదయ్య మరో స్నాచర్ ఇషాన్‌ను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఇషాన్ జేబులో నుంచి కత్తి తీసి యాదయ్య ఛాతి, మెడ, చేతులు, కడుపు, శరీరం వెనక భాగంలో విచక్షణారహితంగా పొడిచాడు.
తీవ్ర రక్తస్రావమవుతున్నా యాదయ్య ఏమాత్రం బెదరకుండా ఇషాన్‌ను అదిమి పట్టుకున్నాడు. ఇంతలో సమీపంలో ఉన్న మరో కానిస్టేబుల్ రవి ఘటనా స్థలానికి రావడంతో ఇరువురు స్నాచర్లను అదుపులోకి తీసుకున్నారు. యాదయ్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఏడు కత్తిపోట్లతో ప్రాణాప్రాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన యాదయ్య 18 రోజులపాటు చావుతో పోరాడాడు.
ఆఖరికి శరీరం లోపల, బయట మూడు సర్జరీలు, వందకు పైగా కుట్లు పడటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. రెండు నెలల విశ్రాంతి తర్వాత మళ్లీ విధుల్లో చేరాడు. గతంలో లాగా శరీరం సహకరించకపోవడంతో అధికారులు యాదయ్యను ఆఫీసు విధులకు పరిమితం చేశారు.
సహచరుల సహకారంతోనే..
తోటి కానిస్టేబుళ్లు దేబేష్, రవి సహకారంతోనే స్నాచర్లను పట్టుకోగలిగాం. ప్రజలకు రక్షణ కల్పించడం పోలీసుగా మా విధి. పై అధికారుల ప్రోత్సాహంతో వారిని ఆదర్శంగా తీసుకొని విధులు నిర్వర్తిస్తాను. –చదువు యాదయ్య, హెడ్ కానిస్టేబుల్
Comments
Please login to add a commentAdd a comment