సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రస్తుత పడకలకు అదనంగా మరో 25 శాతం కరోనా రోగులకు కేటాయించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ వైద్య సేవలను, వాయిదా వేయదగిన (ఎలెక్టివ్) శస్త్ర చికిత్సలను నిలిపేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఇంకా కేసులు పెరిగినట్లయితే ఈ పడకలను కరోనాకు అదనంగా కేటాయించడం వల్ల బాధితులకు మేలు జరుగుతుందని భావిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలో కరోనా కేసుల పెరుగుదలపై గురువారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అధికారులు జయేశ్ రంజన్, రిజ్వీ, ప్రీతి మీనా, రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, టి.గంగాధర్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని, టీకాలు విరివిగా వేయాలని, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, కరోనా జాగ్రత్తలను పాటించాలని ప్రజలకు సూచించారు. వీటి అమలుపై జిల్లా కలెక్టర్లు దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను రెట్టింపు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఆక్సిజన్ వాడకంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సెలవులను రద్దు చేయాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం.
సాధారణ రోగులకు ఇళ్లల్లోనే చికిత్స..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగులను మూడు విభాగాలుగా చేయాలని నిర్ణయించారు. సాధారణ కరోనా పాజిటివ్ వచ్చిన వారు.. మధ్య స్థాయి రోగులు.. సీరియస్ రోగులు. సాధారణ రోగులను ఇళ్లల్లోనే ఉంచి చికిత్స చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి ఆస్పత్రుల్లో పడకలు కేటాయించొద్దని ఆదేశాలు జారీ చేసింది. మధ్యస్థాయి లక్షణాలున్న రోగులకు అవసరాన్ని బట్టి సాధారణ వైద్యం అందించి రెండు, మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలని నిర్ణయించింది. ఇక సీరియస్ రోగులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు పడకలు కేటాయించాలని ఆదేశించింది.
పడకలు, ఆక్సిజన్ వాడకం, రెమిడెసివిర్ ఇంజెక్షన్ల వినియోగం వంటి వాటి వాడకాన్ని క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. అనవసరంగా వాడకూడదన్నారు. కొన్ని ఆస్పత్రుల్లో గతంలో కరోనా చికిత్సలో వాడిన మందులను ఇప్పుడు నిలిపేయగా, వాటిని వాడుతూ లక్షలు గుంజుతున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. బంజారాహిల్స్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆ మందుకోసం ఏకంగా రూ.లక్ష వసూలు చేశారని అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇలాంటివి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ప్రొటోకాల్స్‌పై ప్రైవేట్ వైద్యులకు శిక్షణ..
కరోనా రోగులకు ఎలాంటి మందులు ఇవ్వాలన్న దానిపై గురువారం ప్రైవేట్ వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కొందరికి నేరుగా, మరికొందరికి వర్చువల్ పద్ధతిలో శిక్షణ ఇచ్చారు. కరోనాకు డాక్టర్లు ఎవరికి వారు సొంత వైద్యం చేయకూడదని, నిర్ణీత పద్ధతిలో మందులు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. బాధితులకు కింది జాగ్రత్తలు చెప్పాలని, మందులు సూచించాలని పేర్కొంది.
కరోనా జాగ్రత్తలు, మందులు
- కరోనా రోగులు ప్రత్యేకమైన గదిలో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి.
- రోగితో పాటు ఇంట్లో అందరూ మాస్కు ధరించాలి.
వ్యాధితో ఉన్న వారికి రోజూ పరిశీలించాల్సినవి..
జ్వరం: థర్మామీటర్ ద్వారా 3 పూటలూ చూసుకోవాలి.
ఊపిరి బిగబట్టగల సమయం: 20 సెకండ్ల కన్నా ఎక్కువ ఉండాలి. 6 నిమిషాలు నడిచినా ఆయాసం రాకూడదు.
పల్స్ రేట్: 100 కన్నా మించకూడదు.
ఆక్సిజన్ శాతం: 94 కన్నా తగ్గకూడదు.
కింది మందులు రాసివ్వాలి..
పారాసిటమాల్ మాత్ర: రోజుకు రెండు (ఉదయం/రాత్రి) – 5 /10 రోజులు
బీ కాంప్లెక్స్ మాత్ర: రోజుకు ఒకటి (ఉదయం)– పది రోజులు
విటమిన్–డి మాత్ర: రోజుకు ఒకటి 5/10 రోజులు
విటమిన్–సి మాత్ర: రోజుకు ఒకటి.. 10 రోజులు
లివో సిట్రజిన్ మాత్ర: రోజుకు ఒకటి 5/10 రోజులు
రానిటిడిన్ మాత్ర: రోజుకు ఒకటి (ఉదయం) – 5/10 రోజులు
డాక్సిసైక్లిన్ మాత్ర: రోజుకు రెండు (ఉదయం/రాత్రి)– 5 రోజులు
- జ్వరం తగ్గకుండా ఉంటే, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే (దమ్ము రావడం), ఛాతీలో నొప్పిగా ఉంటే, ఇతర ఆరోగ్య ఇబ్బందులు ఉంటే 108కు ఫో¯Œ చేసి, దగ్గరలో ఉన్న ఆస్పత్రిలో చికిత్స పొందాలి.
Comments
Please login to add a commentAdd a comment