అధికార, విపక్షాల ఆరోపణలు, సవాళ్లతో అట్టుడికిన శాసనసభ
అవినీతి వ్యవహారాల నుంచి వ్యక్తిగత అంశాల దాకా పరస్పరం మాటల దాడులు
చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి
గత ప్రభుత్వ విధానాలతో విద్యుత్ రంగం తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందని ఆక్షేపణ
కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా రాద్ధాంతం చేస్తోందన్న బీఆర్‌ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి
గత ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలన్నీ అవినీతిమయమన్న సీఎం రేవంత్
దీనితో జగదీశ్‌రెడ్డి, రేవంత్, మంత్రి కోమటిరెడ్డిల మధ్య వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్’ పద్దుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చ ప్రకంపనలు రేపింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం, సవాళ్లు– ప్రతిసవాళ్లు, ఆరోపణలు– ప్రత్యారోపణలు, రాజీనామా డిమాండ్లతో సభ అట్టుడికింది. అదే సమయంలో ఇరుపక్షాల నేతల మధ్య వ్యక్తిగత దూషణలూ చోటుచేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ ఏడాది విద్యుత్ రంగానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై సోమవారం శాసనసభలో చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చర్చను ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాల వల్లే విద్యుత్ రంగం నష్టాల్లోకి వెళ్లిందని ఆక్షేపించారు. విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని, ఆ కథంతా వెలికి తీస్తామని పేర్కొన్నారు.
అనంతరం బీఆర్‌ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచామంటూ పలు గణాంకాలను వివరించారు. అవినీతి అంటూ కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఈ దశలో సీఎం రేవంత్ జోక్యం చేసుకున్నారు. బీఆర్‌ఎస్ హయాంలోని విద్యుత్ ఒప్పందాలన్నీ అవినీతిమయమంటూ తీవ్రంగా మండిపడ్డారు. దీనికి కౌంటర్‌గా జగదీశ్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిగా సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి ఇద్దరూ వ్యక్తిగత ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈ సమయంలో ఇరుపక్షాల సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో శాసనసభ దద్దరిల్లింది.
Comments
Please login to add a commentAdd a comment