
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.
గంటకు 41-61 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వర్షాల కంటే ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. శనివారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పియర్ స్థాయి వరకు కొనసాగుతుందని పేర్కొంది.