సాక్షి, హైదరాబాద్ : నగరంలో భారీ వర్షం సంభవించింది. శుక్రవారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. పలుచోట్ల ఇళ్లలోనికి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, లింగంల్లి పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్.నగర్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం వరకూ ఇంకా కొనసాగుతూనే ఉంది. హస్తినపురంలో 9.8 సెం.మీ, కందికల్ గేట్ 7.2 సెం.మీ వర్షపాతం. సరూర్‌నగర్‌లో 6.8 సెం.మీ, చార్మినార్ 6.8 సెం.మీ, చాంద్రాయణగుట్ట 6.5 సెం.మీ, మారేడుపల్లి 6.4 సెం.మీ, ఎల్బీనగర్ 6.4 సెం.మీ, తార్నాక 5.9 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.
ఇక రంగారెడ్డి జిల్లాలోనూ పలుచోట్ల భారీ వర్షం సంభవించింది. నందిగామలో 18 సెం.మీ, కొత్తూరులో 14 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, షాద్‌నగర్‌లో 13.5 సెం.మీ, షాబాద్‌లో 12 సెం.మీ వర్షపాతం, హయత్‌నగర్‌లో 9.8 సెం.మీ, శంషాబాద్‌లో 9.4 సెం.మీ వర్షపాతం సంభవించింది. దీంతో హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లు, కాలనీలు జలమయం అయ్యాయి. కర్మన్ ఘాట్ నుంచి సరూర్ నగర్ చెరువు కట్టకు వెళ్లే ప్రధాన రహదారి నడుము లోతు వరకు నీరు చేరి చెరువును తలపిస్తోంది. రోడ్డుపై వెళ్లేందుకు ప్రయాణికులు భయపడుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు.
ఇక తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం సంభవించింది. ఖమ్మం, కరీంనగర్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా పడుతోంది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నారు. చెరువులతో పాటు భారీ ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి.
అల్పపీడనం బిహార్ వైపు మళ్లింది.అల్పపీడనం బలహీనపడినా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో.. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాలోని కొన్ని చోట్ల భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment