సాక్షి, హైదరాబాద్: సీజన్ ముగిసినా... వర్షాలు వీడటం లేదు. మరోసారి వర్ష ముప్పు తెలంగాణను భయపెడు తోంది. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవ కాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధి కారులను, ప్రజలను సీఎం కె.చంద్రశేఖర్‌రావు కోరారు. రాష్ట్రంలో ఆదివారం చాలాచోట్ల వర్షాలు పడ్డాయి. సోమ, మంగళవారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవ కాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదివారం ఫోన్‌లో ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి, పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాలు, వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ కోరారు.
ఐదు ఉమ్మడి జిల్లాల్లో హైఅలర్ట్: సీఎస్
వచ్చే రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో జిల్లాల్లో పరి పాలన యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండా లని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిందని సీఎస్ వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదలు పోటెత్తడంతో పాటు నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయే అవకాశం ఉంద న్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయి సాధారణ జనజీవనానికి ఆటంకం ఏర్పడొచ్చ న్నారు.
జలాశయాలు, చెరువులు, కుంటలు పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందన్నారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు ప్రజలకు అసౌకర్యం కలగొచ్చని అన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. వరదల సమయంలో పాటించాల్సిన నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని వంతెనలు, కాజ్‌వేలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వీటిపై వాహన, పాదచారుల రాకపోకలను నిషేధించి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తపడాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తమకు నివేదించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment