రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్య పూర్తి చేసిన విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించి వెంటనే న్యాయవాదులుగా నమోదు చేసుకునే చర్యలు చేపట్టాలని తెలంగాణ బార్ కౌన్సిల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఎన్‌రోల్‌మెంట్ తేదీని ఖరారు చేయాలని స్పష్టం చేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) జూలై 31న రాసిన లేఖ ఆధారంగా ఎన్‌రోల్‌మెంట్‌ను ఆపేస్తూ తెలంగాణ బార్ కౌన్సిల్ ఆగస్టు 5న సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిలిపివేతను సవాల్ చేస్తూ నిజామాబాద్‌కు చెందిన సాయితేజతో పాటు మరికొందరు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ, న్యాయ విద్య పూర్తి చేసి ప్రొవిజినల్ సరి్టఫికెట్లను పిటిషనర్లు పొందారని, వారి ఎన్‌రోల్‌మెంట్‌కు తెలంగాణ బార్ కౌన్సిల్ తిరస్కరించిందని చెప్పారు. ఎన్‌రోల్‌మెంట్ ఫీజును రూ. 750 నుంచి రూ. 1,500కు పెంచడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందన్నారు. రూ. 750 మాత్రమే వసూలు చేయాలని ఆగస్టు 7న ఉత్తర్వులు కూడా వెలువడ్డాయని తెలిపారు.
బీసీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ లీగల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్–బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం న్యాయవాదులుగా ఎన్‌రోల్‌మెంట్ చేసుకునే స్వేచ్ఛ రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు లభించిందన్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆగస్టు 6న లేఖ కూడా రాసిందని చెప్పారు.
రాష్ట్ర బార్ కౌన్సిల్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం స్వీకరించిన దరఖాస్తులను సరి్టఫికెట్ల పరిశీలన నిమిత్తం యూనివర్సిటీలకు పంపినట్లు చెప్పారు. వాటిపై పరిశీలన పూర్తికాగానే ఎన్‌రోల్‌మెంట్ తేదీని ఖరారు చేస్తామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిశీలించి ఎన్‌రోల్‌మెంట్ తేదీని ఖరారు చేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment