సాక్షి, హైదరాబాద్: ‘రైతులేం భిక్షగాళ్లు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్మాణం కోసం, అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం తమ భూములను త్యాగం చేస్తున్నారు. వారికి పరిహారం ఇవ్వకుండా వారి భూములెలా స్వాధీనం చేసుకుంటారు’అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరిహారం అందడంలో తీవ్ర జాప్యంతో దిక్కుతోచక కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. భూ నిర్వాసితులపై ప్రభుత్వం దాతృత్వం చూపించాల్సిన అవసరం లేదని, బాధ్యతగా వ్యవహరించి వారికి ఇవ్వాల్సిన పరిహారం సకాలంలో చెల్లించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
చదవండి: పెళ్లయిన నాటి నుంచి గొడవలే.. తట్టుకోలేక..
భూములు స్వాధీనం చేసుకొని ప్రాజెక్టులు నిర్మించి పరిహారం కోసం ఏళ్ల తర బడి వారిని ఇబ్బందులకు గురిచేయడం తగదని తేల్చిచెప్పింది. 1966లో తీసుకున్న తమ భూములకు పరిహారం చెల్లించలేదని, పరిహారం ఇవ్వాలంటూ ఇదే ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయట్లేదంటూ జగిత్యాల జిల్లా రత్నాపూర్‌కు చెందిన బుక్కిరి లింగన్నతోపాటు మరో ఐదుగురు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మళ్లీ విచారించింది. గతంలో ధర్మాసనం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు.
సాంకేతిక కారణాలతో డిపాజిట్ చేయడంలో జాప్యం జరిగిందని వివరణ ఇచ్చారు. భూ సేకరణ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం నిబంధనల మేరకు వ్యవహరిస్తోందని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. 1966లో నిజామాబాద్ జిల్లాలో ఎస్సార్‌ఎస్పీ ప్రాజె క్టు కోసం భూమి సేకరించారని, ఇప్పటివరకు పరిహారం చెల్లించలేదని పిటిషనర్ల తరఫున న్యాయవాది గుడి మధుసూదన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పరిహారం చెల్లిస్తామంటూ మూడుసార్లు హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు.
పరిహారం పొందడం వారి హక్కు...
‘భూసేకరణ అధికారులు ఎక్కడ నిబంధనల మేరకు వ్యవహరిస్తున్నారు. పరిహారం ఇప్పించాలని కోరుతూ వందల కేసులు దాఖలవుతున్నాయి. చెల్లించాలని ఆదేశించినా స్పందన ఉండట్లేదు. అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో వందలాది ఎగ్జిక్యూషన్ పిటిషన్లు దాఖలవుతున్నాయి. ప్రభుత్వం వారికి దానం ఇవ్వట్లేదు. పరిహారం పొందడం వారి హక్కు’ అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని, పిటిషనర్లకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment