
సాక్షి, హైదరాబాద్: మొహర్రం సందర్భంగా ఊరేగింపునకు అనుమతి ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మొహర్రం ఊరేగింపునకు అనుమతి కోరుతూ దాఖలైన ఓ పిటిషన్‌ను మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించిందని, ఈ నేపథ్యంలో తాము ఆదేశాలివ్వలేమని తేల్చిచెప్పింది. ఇటీవల కేంద్ర హోంశాఖ జారీచేసిన మార్గదర్శకాల మేరకు మసీదు/ప్రార్థనా మందిరం ఆవరణలో మొహర్రం ఉత్సవాలు చేసుకోవచ్చని సూచించింది. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఇతర రక్షణ చర్యలను తీసుకుంటూ ఉత్సవాలు చేసుకోవాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లోకి రాకుండా ఉత్సవాలు నిర్వహిస్తామని, కోవిడ్ నిబంధనలు పాటిస్తామని హామీ ఇవ్వాలని, ఈ మేరకు అనుమతులు మంజూరు చేయాలని నగర పోలీసు కమిషనర్‌ను బుధవారం హైకోర్టు ఆదేశించింది. మొహర్రం సందర్భంగా ఊరేగింపునకు అనుమతి ఇచ్చేలా నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించాలని, ఊరేగింపు కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగును తెచ్చేందుకు అనుమతివ్వాలని ఫాతిమా సేవాదళ్ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ విచారించారు.
గత కొన్నేళ్లుగా ఈ ఊరేగింపు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 30న ఊరేగింపునకు అనుమతించా లని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. పాతబస్తీలోని బీబీకా ఆలం నుంచి చాదర్‌ఘాట్ మసీదు వరకు ఊరేగింపు ఉంటుందని, ఇందుకు అనుమతిచ్చేలా నగర పోలీసు కమిషనర్ ను ఆదేశించాలని కోరారు. ఇదే అంశంపై దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించిందని ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరీందర్ కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి.. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రార్థనా మందిరం ఆవరణలో ఉత్సవాలు చేసుకునేందుకు అనుమతి వ్వాలని సీపీని ఆదేశిస్తూ విచారణను ముగించారు.