రాష్ట్రంలో ప్రధాన పార్టీల దూకుడు, పోటాపోటీ కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ‘హై ఓల్టేజీ’ వాతావరణం నెలకొంది. జాతీయ కార్యవర్గ భేటీ, బహిరంగ సభ నేపథ్యంలో విమర్శలతో దూకుడుగా వెళ్తున్న బీజేపీ.. దానిని దీటుగా తిప్పికొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న టీఆర్‌ఎస్.. తాము కూడా ఉన్నామంటూ డిమాండ్లు,లేఖలతో కాంగ్రెస్.. మొత్తంగా రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా టీఆర్‌ఎస్– బీజేపీల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలతో జరుగుతున్న పోరు ఉత్కంఠ రేపుతోంది. ఓవైపు ప్రధాని మోదీ, మరోవైపు సీఎం కేసీఆర్‌తమ ప్రసంగాల్లో ఏం మాట్లాడుతారన్నది చర్చనీయాంశంగా మారింది.
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా శుక్రవారమే హైదరాబాద్‌కు వచ్చారు. ఇంతకుముందే పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లు రాష్ట్రంలోని నియోజకవర్గాలకు చేరుకుని రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. శనివారం వస్తున్న ప్రధాని మోదీ.. కార్యవర్గ భేటీలో పాల్గొనడంతోపాటు ఆదివారం పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మొత్తంగా కార్యవర్గ భేటీ, సభను విజయవంతం చేయడం ద్వారా రాష్ట్రంలో సత్తా చాటేందుకు బీజేపీ ప్రణాళిక రచించింది. మరోవైపు కార్యవర్గ భేటీకి ముందే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరికొందరు నేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
జలవిహార్ భేటీపై అందరి దృష్టి...
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇప్పటికే సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతు పలికిన టీఆర్‌ఎస్.. ఆయనకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తోంది. అటు సిన్హా, ఇటు ప్రధాని మోదీ కొద్ది గంటల తేడాలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుండటంతో.. సిన్హా స్వాగత కార్యక్రమం ద్వారా సత్తా చాటేలా టీఆర్‌ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. స్వయంగా సీఎం కేసీఆర్ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండటంతోపాటు నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో జరిగే టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ భేటీకి నేతృత్వం వహించనుండటం ఆసక్తిగా మారింది. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, మోదీ పాలనపై కేసీఆర్ విమర్శలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరోవైపు వందల మంది బీజేపీ సీనియర్లు హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో టీఆర్‌ఎస్ ‘ఫ్లెక్సీ వార్’కు తెరలేపింది. ప్రధాన మార్గాలు, ఫ్లైఓవర్లు, బస్ షెల్టర్లు వంటిచోట్ల రాష్ట్ర ప్రభుత్వ విజయాలు, పథకాలతో ‘వెల్‌కమ్ టు హైదరాబాద్ ’అంటూ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేసింది. పలుచోట్ల ‘బై బై మోదీ’ నినాదంతో టీఆర్‌ఎస్‌నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. ప్రధాన మీడియాలోనూ టీఆర్‌ఎస్, బీజేపీ ప్రకటనల యుద్ధానికి సిద్ధమయ్యాయి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తదితర నేతల విమర్శలకు దీటుగా టీఆర్‌ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ‘తెలంగాణ నుంచి నేర్చుకోండి’ అంటూ ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ రాయడం గమనార్హం.
విభజన హామీల అమలు అంటూ కాంగ్రెస్..
ప్రధాని మోదీ రాకను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ పలు వ్యాఖ్యలు చేసింది. విభజనహామీలు నెరవేర్చిన తర్వాతే మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న హామీలను అమలు చేశాకే ప్రధాని రావాలంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment