రుణమాఫీ.. కోతలే! | Huge cuts in 2nd Phase of farmer loan waiver: telangana | Sakshi
Sakshi News home page

రుణమాఫీ.. కోతలే!

Published Thu, Aug 1 2024 3:51 AM | Last Updated on Thu, Aug 1 2024 3:51 AM

Huge cuts in 2nd Phase of farmer loan waiver: telangana

రైతులు 35.49 లక్షలు.. రుణమాఫీ సొమ్ము రూ. 24,449 కోట్లు! 

ఈసారి మూడు విడతల్లో రుణమాఫీకి వ్యవసాయశాఖ తేలి్చన లెక్క ఇది

గతంలో ‘లక్ష’మాఫీకి 36.68 లక్షల రైతులైతే.. 2 లక్షల మాఫీకి 35.49 లక్షల మందే..

లక్ష రుణమాఫీ కంటే 2 లక్షల మాఫీలో 1.19 లక్షలు తగ్గిన రైతుల సంఖ్య 

రుణమాఫీలో కోతలు..రేషన్‌కార్డు, పీఎం కిసాన్‌ నిబంధనల అమలు వల్లేనా? 

రేషన్‌కార్డు ఉన్నవారికే ప్రస్తుతం మాఫీ.. వ్యవసాయ శాఖ సర్క్యులర్‌ జారీ

సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణమాఫీలో భారీగా కోతలు పడ్డాయి. ఈసారి మూడు విడతల రుణ మాఫీలో మొత్తం రైతు కుటుంబాల సంఖ్య 35,49,870 కాగా, వారికి మాఫీ చేస్తున్న సొమ్ము రూ. 24,449 కోట్లు అని వ్యవసాయశాఖ వర్గాలు తేల్చాయి. మొదటి విడతలో 11,34,412 మంది రైతు కుటుంబాలకు రూ.6,034 కోట్లు ఇచ్చారు. ఇక మంగళవారం రెండో విడతలో 6,40,223 మంది రైతు కుటుంబాలకు రూ. 6,190 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఇక మూడో విడతకు సంబంధించి వ్యవసాయశాఖ వర్గాల లెక్క ప్రకారం 17,75,235 మంది రైతు కుటుంబాలకు రూ.12,225 కోట్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో 2018లో ప్రకటించిన లక్షలోపు రుణమాఫీకి ప్రకటించిన రైతుల కంటే ఇప్పుడు రైతుల సంఖ్య తగ్గడం గమనార్హం. 2018లో మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు రూ.19,198 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని నిర్ణయించింది. లక్షలోపు రుణమాఫీతో పోలిస్తే, ఇప్పుడు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తున్నా అప్పటికంటే ఇప్పుడు 1.19 లక్షల మంది రైతులు తగ్గడం గమనార్హం.  

మొదటి విడతలోనే తగ్గిన సొమ్ము  
మొదటి విడతలో 11.34 లక్షల మందికి రూ. 6,034 కోట్లు జమ చేశారు. వీరంతా రూ.లక్ష వరకు పంట రుణాలు తీసుకున్న రైతులే. కాగా 2018లో లక్ష వరకు రుణమాఫీ రూ.19 వేల కోట్లకు పైబడి ఉండగా, ఇప్పుడు లక్ష రూపాయల వరకు రుణమాఫీ కేవలం రూ.6,034 కోట్లతో, కేవలం మూడోవంతుకే పరిమితమైంది. భారీగా రైతుల సంఖ్య, రుణమాఫీ సొమ్ము కూడా తగ్గింది. పీఎం కిసాన్, రేషన్‌కార్డు తదితర నిబంధనల వల్ల పెద్దఎత్తున అర్హులైన రైతులు తగ్గుతున్నారని రైతునేతలు అంటున్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో రూ.2 లక్షల రుణాలున్న రైతులందరికీ మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎందుకు నిబంధనలు పెడుతోందని వారు ప్రశి్నస్తున్నారు. కాగా, అనేక జిల్లాల్లో ఇప్పటికీ రైతులు తమకు రైతు రుణమాఫీ రాలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. 

ఒకేచోట 50 మందికి రుణమాఫీ జరగలేదు  
ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లో మంగళవారం రుణమాఫీ సంబరాలు నిర్వహిస్తుండగా జైనథ్‌ మండలానికి చెందిన 50 మందికి పైగా రైతులు అక్కడకు వచ్చారు. కలెక్టర్‌ను కలిసి తాము రెండో విడతలో లక్షన్నర రుణమాఫీకి అర్హులైనా, తమకు ఆ ప్రయోజనం దక్కలేదని వినతిపత్రం అందజేశారు.

ఆ మండల కేంద్రంలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఖాతాదారులైన ఆ రైతులు తమకు రుణమాఫీ దక్కలేదని మొదట వ్యవసాయశాఖ అధికారులను అడిగితే బ్యాంక్‌ అధికారులు అసలు వారి వివరాలను ప్రభుత్వానికి పంపలేదని చెప్పడంతో నిర్ఘాంతపోయారు. దీంతో వారు కలెక్టర్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు. కలెక్టర్‌..రాష్ట్ర నోడల్‌ అధికారితోపాటు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు దృష్టికి కూడా తీసుకెళ్లారు. బ్యాంకు అధికారులు ఎందుకు పంపలేదో అంతుబట్టడం లేదని అంటున్నారు. మాఫీకి నిబంధనలు ఏమైనా అడ్డువచ్చాయా? లేక ఏదైనా కారణం ఉందా తెలియడం లేదు.  

పేర్లు సరిపోలక 18మందివి రిజెక్ట్‌  
నారాయణపేట సింగిల్‌ విండో కార్యాలయ పరిధిలో లక్షన్నర రుణమాఫీకి 44 మంది రైతులు అర్హులు. అందులో 26 మందికిగాను రూ.20.55,349 మందికి రుణమాఫీ అయ్యింది. మిగిలిన వారికి పాసుబుక్, ఆధార్‌కార్డులో పేర్లు తేడా ఉండడంతో రాలేదు. రేషన్‌కార్డు ఆధారంగా పేరు మ్యాచ్‌ కావడం లేదని అక్కడి ప్యాక్స్‌ కార్యదర్శి అశోక్‌కుమార్‌ అంటున్నారు.  

బాం్యకు పేరు మాయం  
జనగామ యూనియన్‌ బ్యాంకు బ్రాంచ్‌లో జనగామ, పాలకుర్తి, లింగాలఘణపురం, దేవరుప్పుల, రఘునాథపల్లి మండలాలకు చెందిన 500 మందికిపైగా రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి 300 మందికి అర్హత ఉంది. బ్యాంకుల వారీగా రుణమాఫీ జాబితా వివరాలు తీసుకున్న సర్కారు, అర్హుల జాబితాను ప్రకటించే క్రమంలో ‘యూనియన్‌ బ్యాంకు’పేరు గల్లంతు అయ్యింది. మూడు విడతల రుణమాఫీ పూర్తయిన తర్వాత, గల్లంతు జాబితాను పరిశీలిస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతులు ఒకింత కలవరపాటుకు గురవుతున్నారు.  

ఇద్దరు రైతులకు ఒకే ఆధార్‌ నంబర్‌ నమోదు 
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రేణికుంట్ల సాంబయ్య డీసీసీబీలో రూ.60వేల రుణం తీసుకున్నాడు. అయితే మొదటివిడతతో రుణమాఫీ జరగలేదు. దీంతో రైతు విస్తరణ అధికారిని అడగ్గా.. నీ పేరుమీద రూ.2లక్షలకుపైగా రుణం ఉందని వివరాల కాపీని అందజేశారు.

ఆత్మకూరు డీసీసీబీ బ్యాంకులో తన పేరుతో ఒకే ఆధార్‌ నంబర్‌తో 1,49,861 పంట రుణం, రూ.83,337 మరో రుణం మొత్తంగా రూ.2,33,198 ఉండడంతో ఆశ్చర్యపోయాడు. అదే గ్రామంలో రేణికుంట్ల సాంబయ్య ఉండగా ఆయన రుణాన్ని కూడా బ్యాంకర్లు తన ఆధార్‌ నంబర్‌తోనే నమోదు చేయడంతో తన పేరుపై రెండు లక్షలకుపైగా రుణమున్నట్టు వచి్చందని, దీంతో అర్హత ఉన్నా తాను రుణమాఫీకి అర్హత కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.  

రేషన్‌కార్డు లేదని మాఫీ కాదంటున్నారు  
మూడేళ్ల క్రితం గ్రామీణ వికాస్‌ బ్యాంకులో రూ.లక్ష రుణం తీసుకున్నా. ఇప్పుడు అది వడ్డీతో కలిపి రూ.1.40 లక్షలు అయ్యింది. రెండో విడతలో మాఫీ అవుతుందని అనుకున్నా, లిస్ట్‌లో పేరు లేకపోతే..ఏఈఓ దగ్గరికి వెళ్లి నా ఆధార్‌కార్డుతో పరిశీలించమని చెప్పగా రేషన్‌కార్డు లేకపోవడంతో కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయాల్సి ఉందని, రుణమాఫీ చేయకుండా నిలిపివేసినట్టు తెలిపారు. నాకు ఇంతవరకు రేషన్‌ కార్డు రాలేదు. 
– బోడపోతుల రమేష్, రైతు కొణిజర్ల, ఖమ్మం జిల్లా 

బాక్స్‌గా వాడాలి.  
రేషన్‌కార్డున్న వారికే ప్రస్తుతం మాఫీ  – సర్క్యులర్‌ జారీ చేసిన వ్యవసాయశాఖ  
రుణమాఫీ కాకపోవడానికి కారణాలేంటో వ్యవసాయశాఖ ఒక సర్క్యులర్‌ జారీచేసింది. వాటిని అన్ని జిల్లాల వ్యవసాయశాఖ అధికారులకు పంపించింది. వాటిని రైతులకు కిందిస్థాయి అధికారులు ప్రశ్న, జవాబుల రూపంలో వివరిస్తున్నారు. అవేంటంటే... 

ప్రశ్న: లక్ష లేదా లక్షన్నరలోపే నాకు రుణం ఉంది. కానీ నాకు ఇంకా మాఫీ కాలేదు ఎందుకు? 
జవాబు: రుణమాఫీ కుటుంబ ప్రాతిపదికన వర్తిస్తుంది. మీ కుటుంబానికి మొత్తం ప్రస్తుతం లక్షన్నర లోపు ఉంటే మాఫీ అవుతుంది. 

ప్రశ్న: మా కుటుంబం అందరి పేరు మీదలక్షన్నరలోపే ఉంది. అయినా మాఫీ కాలేదెందుకు? 
జవాబు: మీకు రేషన్‌కార్డు లేకపోవచ్చు. రేషన్‌కార్డు లేని వారి వద్దకు త్వరలో అధికారులు వచ్చి గ్రామపంచాయతీలో గ్రామకమిటీ ద్వారా కుటుంబ నిర్ధారణ చేశాక రుణమాఫీ అవుతుంది. ఈ ప్రక్రియ చేయడానికి సమయం పడుతుంది. మీ గ్రామానికి వచ్చే ముందు ప్రతి ఒక్కరికి సమాచారం ఇస్తాం. ప్రస్తుతం రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే మాఫీ అయ్యింది. రేషన్‌కార్డు లేని వారికి విచారణ చేశాక మాఫీ చేస్తాం. 

ప్రశ్న : రేషన్‌ కార్డు ఉంది. మా కుటుంబంలో అందరి పేరు మీద లక్షలోపే ఉంది. అయినా మాకు రుణమాఫీ కాలేదు.  
జవాబు : ఆధార్‌ అనుసంధానం సమస్య వల్ల కాలేకపోవచ్చు. మీ ఆధార్‌ + మీ లోన్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ + పట్టాదారు పాసుబుక్‌ జిరాక్స్‌లతో రైతు వేదికల వద్ద వెంటనే సంప్రదించాలి. 

ప్రశ్న : మా కుటుంబంలో అందరం 2018 కన్నా ముందు లోన్‌ తీసుకున్నాం. ప్రతి సంవత్సరం రెన్యూవల్‌ చేస్తున్నాము. అయినా మాకు రుణమాఫీ కాలేదు. 
జవాబు: మీరు రుణ ఖాతా తెరిచిన తేదీ అంటే డేటాఫ్‌ శాంక్షన్‌ పరిగణనలోనికి తీసుకుంటారు. 2018 డిసెంబర్‌ 12వ తేదీ కంటే ముందు మీరు రుణం తీసుకుంటే మీకు రుణమాఫీ వర్తించదు. 

ప్రశ్న: మా ఇంట్లో నేనొక్కడినే ఉన్నాను. పిల్లలు సెపరేట్‌ అయ్యారు. నాకు రేషన్‌కార్డు లేదు. నాకు లక్ష మాత్రమే లోన్‌ ఉంది. ఇంకా నాకు రుణమాఫీ కాలేదు ఎందుకు ? 
జవాబు: మీరు ఒక్కరే అని మీరు చెప్పితే సరిపోదు. త్వరలో అధికారులందరం గ్రామాలలోకి వస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామకమిటీ కుటుంబ నిర్ధారణ చేస్తుంది. కుటుంబ నిర్ధారణ చేసిన తర్వాతనే మీకు రుణమాఫీ అవుతుంది. అప్పటివరకు మీకు లక్షలోపు రుణమున్నా ఇప్పుడే రుణమాఫీ కాదు.

జాబితాలో నా పేరు రాలేదు  
నాపేరు తూరి్పంటి స్వామి. చౌటుప్పల్‌లోనియూనియన్‌ బ్యాంకులో గతేడాది అక్టోబర్‌ నెలలో రూ. 1,19,700 రుణం తీసుకున్నాను. తాజాగా ప్రభు త్వం రుణమాఫీ ప్రకటించడంతో నా లోను మాఫీ అవుతుందని అనుకున్నాను. కానీ జాబితాలో నా పేరు లేదు. బ్యాంకు, వ్యవసాయ కార్యాలయానికి వెళ్లగా నా పేరు లేదు. నాకు రుణమాఫీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement