సాక్షి, సిటీబ్యూరో: నగరం నుంచి వ్యాపార నిమిత్తం సెర్బియాకు వలసవెళ్లిన ఫెరోజ్ ఖాన్ అక్కడి జైల్లో మగ్గుతున్నాడు. పది నెలలుగా ఆయన విషయంపై సిటీలో ఉంటున్న తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం లేదు. సెర్బియాలోనే స్థిరపడిన ఫెరోజ్ సోదరి ఆరా తీయగా జైల్లో ఉన్న విషయం బయటపడింది. నేరుగా జోక్యం చేసుకోవడానికి అక్కడి భాతర రాయబార కార్యాలయం నిరాకరించడంతో సహాయం చేయాల్సిందిగా కోరుతూ ఫెరోజ్ సోదరుడు నూమన్ హుస్సేన్ జునైదీ విదేశాంగ శాఖకు లేఖ రాశాడు. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన అధికారులు సోమవారం ఫెరోజ్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు.
బెల్గ్రేడ్‌లో రెస్టారెంట్ ఏర్పాటు చేసి..
ఫస్ట్ లాన్సర్‌లోని ఖాజానగర్ ప్రాంతానికి చెందిన ఫెరోజ్ ఖాన్ (44) తండ్రి మాజీ ప్రభుత్వ ఉద్యోగి. ప్రస్తుతం తండ్రి, తల్లి కూడా అనారోగ్య కారణాలతో మంచానికే పరిమితయ్యారు. పదిహేనేళ్ల క్రితం భార్య నుంచి విడాకులు తీసుకున్న ఫెరోజ్ అప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తున్నారు. సెర్బియాలో రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఫెరోజ్ బిజినెస్ వీసాపై 2020లో అక్కడికి వలస వెళ్లాడు. బెల్గ్రేడ్‌లో ఉన్న బ్రాంకోవా–19లో ఇండో–అరబ్ పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. భారత్‌తో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వెళ్లి సెర్బియాలో స్థిరపడిన వారు ఫెరోజ్ రెస్టారెంట్‌కు రెగ్యులర్ కస్టమర్లుగా ఉండే వాళ్లు.
నాటకీయ పరిణామాల మధ్య మిస్సింగ్...
సెర్బియా నుంచి అనునిత్యం నగరంలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడే ఫెరోజ్ ఆఖరుసారిగా గతేడాది మార్చి 10న కాల్ చేశాడు. అప్పటి నుంచి ఆయన ఫోన్లు పని చేయకపోవడంతోపాటు ఆచూకీ లేదు. దీంతో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కొన్నాళ్లు ఎదురుచూశారు. చివరకు సెర్బియాలో ఉన్న ఫెరోజ్‌కు సోదరి వరుసయ్యే మహిళను సంప్రదించారు. బ్రాంకోవాలోని ఇండో–అరబ్ రెస్టారెంట్ వద్దకు వెళ్లిన ఆమె అది చాన్నాళ్ల క్రితమే మూతపడినట్లు గుర్తించింది. చుట్టుపక్కల ఆరా తీయగా గతేడాది మార్చి 9న రెస్టారెంట్‌లో కొందరు భారతీయులు–బంగ్లాదేశీయుల మధ్య గొడవ జరిగిందని, వారికి ఫెరోజ్ సర్దిచెప్పాడని, ఆ మర్నాడే అక్కడి పోలీసులు అతడిని అరెస్టు చేశారని తెలిసింది. ఈ విషయం నగరంలో ఉన్న ఫెరోజ్ తల్లిదండ్రులకు చెప్పిన ఆమె... సెర్బియాలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్నీ సంప్రదించింది.
ఢిల్లీ నుంచి ఉత్తర్వులు రావాలనడంతో...
అక్కడి జైల్లో మగ్గుతున్న ఫెరోజ్ వివరాలు ఆరా తీయడానికి నిరాకరించిన రాయబార కార్యాలయం తాము జోక్యం చేసుకోవాలంటే ఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) నుంచి ఆదేశాలు రావాలని స్పష్టం చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఫెరోజ్ సోదరుడు, ఆలియాబాద్ వాసి నూమన్ శుక్రవారం భారత విదేశాంగ శాఖకు లేఖ రాశారు. దీనికి సంబంధించి ఎంబీటీ పార్టీ నేత అమ్జదుల్లా ఖాన్ ఎంఈఏకు ట్వీట్ చేస్తూ ఫెరోజ్‌పై సెర్బియాలో నమోదైన కేసు వివరాలు తెలుసుకోవాలని కోరారు. ఆయనకు న్యాయం చేయడంతో పాటు భారత్‌కు రప్పించడానికి ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు.
నూమన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఫెరోజ్ జైల్లో ఎందుకు ఉన్నాడో తెలీదు. దీనిపై అక్కడి పోలీసులు కనీసం అతడి తల్లిదండ్రులకూ సమాచారం ఇవ్వలేదు. విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసిన తర్వాత స్పందన మొదలైంది. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు వచ్చి పూర్తి వివరాలు తీసుకున్నారు. ప్రభుత్వం స్పందించి ఫెరోజ్‌కు న్యాయం చేయాలని కోరుతున్నా’ అన్నారు.
చదవండి: డెక్కన్ మాల్ రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత.. బిల్డింగ్ కూల్చివేతపై సందిగ్ధం
Comments
Please login to add a commentAdd a comment