సాక్షి, హైదరాబాద్: బల్క్ డీజిల్ ధర ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. ఒక్కరోజులోనే లీటరుపై రూ.19 మేర పెరిగింది. బహిరంగ మార్కెట్‌లో కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా పన్నుల్లో సర్దుబాటు చేస్తుండంతో ధర స్థిరంగా ఉండగా, చమురు కంపెనీల నుంచి నేరుగా సరఫరా చేసే బల్క్ ఆయిల్ ధర మాత్రం.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెరుగుతూ పోతోంది.
మంగళవారం వరకు హైదరాబాద్‌లో బల్క్ డీజిల్ లీటరుకు రూ.99 (దూరాన్ని బట్టి రూపాయి మేర తేడా) ఉండగా, బుధవారం అది రూ.19 మేర పెరిగి రూ.118కి చేరుకుంది. యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగటంతో దేశీయంగా కూడా వాటి ధరలు పెరిగాయి. కానీ ఒకే రోజు ఏకంగా రూ.19 మేర లీటరుపై పెరగటం ఇదే తొలిసారి.
రిటైల్‌లోనే ఆర్టీసీ కొనుగోళ్లు
నిత్యం సగటున ఆరున్నర లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగించే ఆర్టీసీ నేరుగా చమురు కంపెనీల నుంచి బల్క్‌గా డీజిల్ కొంటోంది. అయితే యుద్ధం నేపథ్యంలో బల్క్ డీజిల్ ధర అంతకంతకూ పెరుగుతుండటంతో బల్క్ కొనుగోళ్లు ఆపేసి రిటైల్‌గా కొనటం ప్రారంభించింది. కానీ ప్రతి బస్సు బంకుకు వెళ్లి రావటంతో కొంత డీజిల్ వృథాగా వినియోగం కావడంతో చాలా డిపోల్లో బల్క్ డీజిల్‌నే వినియోగిస్తున్నారు. అయితే, బుధవారం డీజిల్ ధర ఒక్కసారిగా భగ్గుమనేసరికి ఆర్టీసీ బెంబేలెత్తిపోయింది. వెంటనే బల్క్ కొనుగోళ్లు ఆపేసి ప్రతి బస్సు బంకుకు వెళ్లి డీజిల్ నింపుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment