Heavy Rains in Hyderabad, Cabs and Auto Fares Jumps High- Sakshi
Sakshi News home page

డబుల్‌ ‘ధమాకా’ : సికింద్రాబాద్‌ నుంచి బంజారాహిల్స్‌కు ఏకంగా రూ.1,050

Published Tue, Sep 28 2021 8:26 AM | Last Updated on Tue, Sep 28 2021 10:33 AM

Hyderabad: Heavy Rains In City, Cabs And Auto Prices Jumps - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్యాబ్‌లు, ఆటోలు ఠారెత్తించాయి.. చార్జీల మోత మోగించాయి.. ఒకవైపు సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. మరోవైపు భారత్‌ బంద్‌ నేపథ్యంలో నెలకొన్న ప్రభావంతో నగరంలో ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడ్డారు. ఆటోలు, సెవెన్‌సీటర్‌ ఆటోలు రెట్టింపు చార్జీలను వసూలు చేయగా, క్యాబ్‌లలో సర్‌ చార్జీలు, పీక్‌ అవర్స్‌ నెపంతో అమాంతంగా పెంచారు. సాధారణ రోజుల్లో ఉండే చార్జీలకంటే రెట్టింపు చెల్లించాల్సి వచి్చందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, తదితర రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించిన  ప్రయాణికులు, ఆసుపత్రులు వంటి అత్యవసర పనులపై బయటకు వెళ్లిన వాళ్లు నిలువుదోపిడీకి గురయ్యారు.  
చదవండి: మణికొండలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతదేహం లభ్యం

ఇదేం సర్‌చార్జీ.. 
సాధారణ రోజుల్లో సికింద్రాబాద్‌ నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–10 వరకు క్యాబ్‌ చార్జీ రూ.300 నుంచి రూ.350 వరకు ఉంటుంది. కానీ సోమవారం ఇది ఏకంగా రూ.1,050 వరకు చేరింది. సెడాన్‌లలో  రూ.1,250 వరకు చార్జీలు వసూలు చేశారు. సర్‌చార్జీలతో ప్రయాణికులపై క్యాబ్‌ సంస్థలు అదనపు బాదుడుకు పాల్పడ్డాయి. ప్రయాణికులు క్యాబ్‌ బుక్‌ చేసుకొనే సమయానికి క్యాబ్‌లు అందుబాటులో లేవనే అంశాన్ని  సాకుగా చూపుతూ సమీప ప్రాంతాల్లో ఉన్న క్యాబ్‌లను ఏర్పాటు చేసే ఉద్దేశంతో 5 కిలోమీటర్‌ల నుంచి 10 కిలోమీటర్‌ల వరకు సర్‌ చార్జీల రూపంలో అదనపు చార్జీలు విధిస్తున్నారు.  
చదవండి: ఎల్‌బీ నగర్‌: యువతిపై కానిస్టేబుల్‌ లైంగికదాడి 

► సాధారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే కనిపించే రద్దీని వర్షం దృష్ట్యా అన్ని వేళల్లో రద్దీ ఉన్నట్లు చూపుతూ పీక్‌ అవర్స్‌(రద్దీ గంటలు)లో అదనపు చార్జీలను విధించారు. దీంతో ఈసీఐఎల్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు రూ.200 వరకు ఉండే చార్జీలు సోమవారం సాయంత్రం ఏకంగా రూ.500 దాటినట్లు వెంకటేశ్‌ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు.  
చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వర్షం: ఏటా ఇదే సీన్‌.. అయినా!

► నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న చార్జీలు సాయత్రం అమాంతంగా పెరిగాయి. మరోవైపు క్యాబ్‌ సంస్థలు విధించే సర్‌చార్జీలు, పీక్‌అవర్స్‌ చార్జీల్లో తమకు  ఏ మాత్రం లభించడం లేదని, కేవలం ఆయా సంస్థల ఖాతాల్లోనే జమ అవుతుందని డ్రైవర్లు వాపోతున్నారు.  
పెరిగిన క్యాబ్‌ల వినియోగం.. 

► కోవిడ్‌ దృష్ట్యా తీవ్రంగా నష్టపోయిన క్యాబ్‌లు ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్నాయి. మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో వేలాది మంది క్యాబ్‌ డ్రైవర్లు వాహనాలను వదులుకొని ప్రత్యామ్నాయ ఉపాధిని చూసుకోవాల్సి వచ్చింది. కానీ లాక్‌డౌన్‌ అనంతరం కోవిడ్‌ కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో రెండు నెలలుగా క్యాబ్‌ల వినియోగం పెరిగింది.  

► ప్రతిరోజూ 40 వేలకు పైగా క్యాబ్‌లు తిరుగుతున్నట్లు అంచనా. ఐటీ, పర్యాటక రంగాలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించడంతో పాటు అంతర్జాతీయ రాకపోకలు తిరిగి మొదలైతే మరో 20 వేలకు పైగా క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలా ఉండగా కోవిడ్‌ నష్టాన్ని పూడ్చుకునేందుకే క్యాబ్‌ సంస్థలు దోపిడీకిపాల్పడుతున్నాయని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.  

ఆటో ఇష్టారాజ్యం.. 
చాలాకాలంగా మీటర్లను వినియోగించకుండానే నడుపుతున్న ఆటోవాలాలు ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. సోమవారం బంద్‌ వార్తలతో పాటు వర్షం కూడా తోడవడంతో  బాహాటంగానే తమ దోపిడీ పర్వాన్ని సాగించారు. జూబ్లీబస్‌స్టేషన్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ వరకు ఏకంగా రూ.280 తీసుకున్నట్లు ఒక ప్రయాణికుడు ఆందోళన వ్యక్తం చేశాడు. వర్షం కారణంగా త్వరగా ఇళ్లకు చేరుకోవాలని ఆటోలను ఆశ్రయించిన వారికి ఆటోవాలాలు పట్టపగలే చుక్కలు చూపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement