సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ తీరం సమ్మోహన రాగం ఆలపించనుంది. సరికొత్త అందాలను సంతరించుకోనుంది. ఒకవైపు అలలపై వెల్లువెత్తే సంగీత ఝరి.. మహోన్నతమైన హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ వైభవాన్ని ప్రదర్శించే లేజర్ షో.. నగరవాసులను, సందర్శకులను, పర్యాటకులను సమ్మోనంగా ఆకట్టుకోనుంది.
మరోవైపు అమరుల త్యాగాలను సమున్నతంగా ఆవిష్కరించేలా ఎంతో అద్భుతంగా రూపొందించిన అమరుల స్మారక చిహ్నం కూడా ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. అలనాటి వైభవాన్ని మరోసారి గుర్తుకు తెచ్చేవిధంగా ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులు సైతం అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు హుస్సేన్ సాగర్ జలాలపై నడిచిన అనుభూతిని కలిగించే వేలాడే వంతెన సైతం ప్రారంభానికి సిద్ధమవుతోంది. మొత్తంగా నెక్లెస్‌రోడ్డులో ఫిబ్రవరి మొదటి వారం నుంచి సందడి నెలకోనుంది.
ఫార్ములా– ఈ పనులు శరవేగం..
► ఫార్ములా– ఈ అంతర్జాతీయ పోటీలకు నెక్లెస్‌రోడ్డు సన్నద్ధమవుతోంది. స్వల్ప మార్పులు, చేర్పులతో 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌ను పునరుద్ధరించారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఈ పోటీల్లో 11 ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు పాల్గొననున్న సంగతి తెలిసిందే. 22 మంది రేజర్లు ఈ పోటీల్లో తమ సత్తా చాటనున్నారు. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ఈ వాహనాలు పరుగులు తీయనున్నాయి.
► సందర్శకులకు ఇదో సరికొత్త అనుభూతి కానుంది. మరోవైపు ఈ అంతర్జాతీయ పోటీల నాటికే నెక్లెస్‌రోడ్డు పరిసరాలను మరింత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు దూసుకెళ్లే ట్రాక్‌ను నీలిరంగు డివైడర్‌లతో ఆకర్షణీయంగా రూపొందించారు. ప్రదర్శనను తిలకించేందుకు వచ్చే మోటార్‌స్పోర్ట్స్ ప్రియులకు ఫార్ములా–ఈ పోటీలకు చక్కటి అనుభూతినిచ్చేవిధంగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 25 వేల మందికి పైగా వీక్షించేందుకు అనుగుణంగా ఇవి అందుబాటులోకి రానున్నాయి.
అలలపై సంగీత సవ్వడులు..
హుస్సేన్‌సాగర్‌లో సుమారు రూ.18 కోట్లతో హెచ్‌ఎండీఏ చేపట్టిన మ్యూజికల్ ఫౌంటెన్ కూడా ఫార్ములా– ఈ పోటీల నాటికి ప్రారంభం కానుంది. మిరుమిట్లుగొలిపే రంగు రంగుల వెలుగు జిలుగుల నడుమ ఉవ్వెత్తున ఎగిసిపడే జలాలు.. నేపథ్యంగా వినిపించే ఆహ్లాదభరితమైన సంగీతం సందర్శకులకు చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. దీంతో పాటు లేజర్ షోను కూడా ప్రదర్శించనున్నారు. నాలుగువందల ఏళ్ల హైదరాబాద్ చరిత్ర, సాంస్కృతిక విశేషాలు, వారసత్వ కట్టడాల ప్రత్యేకతలను ఈ ప్రదర్శన ద్వారా ఆవిష్కరిస్తారు. పర్యాటకులు, సందర్శకులే కాకుండా నెక్లెస్‌రోడ్డు మీదుగా రాక పోకలు సాగించే వారు కూడా ఈ ప్రదర్శనను వీక్షించవచ్చు.మరోవైపు సంజీవయ్య పార్కుకు సమీపంలో చేపట్టిన వేలాడే వంతెన నిర్మాణం కూడా తుది దశకు చేరుకుంది. దీనిపై నడుస్తున్నప్పుడు నీటిపైనే నడుస్తున్న భావన కలుగుతుంది. పారిస్‌లోని ఓ నదిపై ఏర్పాటు చేసిన వంతెనకు నమూనాగా హెచ్‌ఎండీఏ ప్రాజెక్టును చేపట్టింది.
త్యాగాలను ఎత్తిపట్టేలా...
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎంతోమంది అసువులు బాశారు. ప్రాణాలను బలిదానం చేశారు. వారి త్యాగాలను నిరంతరం స్మరించుకొనేవిధంగా లుంబిని పార్కు వద్ద సుమారు రూ.60 కోట్లతో చేపట్టిన అమరుల స్మృతి చిహ్నం ప్రపంచంలోనే ఒక అరుదైన చారిత్రక కట్టడంగా ఆవిష్కృతం కానుంది. స్టీల్‌తో నిర్మించిన ఈ స్మారక చిహ్నం అమరులకు నివాళులరి్పస్తూ జ్యోతిని వెలిగించినట్లుగా రూపొందించారు. అద్దంలా మెరిసే ఈ అపురూపమైన కట్టడం కూడా ఫార్ములా–ఈ పోటీల నాటికి ప్రారంభం కానుంది.
త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు...
ఒకప్పటి డబుల్ డెక్కర్ బస్సులను తలపించేలా హెచ్‌ఎండీఏ విద్యుత్ ఆధారిత డబుల్ డెక్కర్ బస్సులను నగరంలో ప్రవేశపెట్టనుంది. ఈ బస్సులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలోని పర్యాటక,చారిత్రక ప్రాంతాలను సందర్శించేందుకు అనుగుణంగా వీటిని నడుపనున్నారు.
చదవండి: ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ
Comments
Please login to add a commentAdd a comment