ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: కరోనా నేర్పిన గుణపాఠంతో ప్రభుత్వాలు మేల్కొన్నాయి. వందకు పైగా పడకలున్న ఆస్పత్రుల్లో ఇక ఆక్సిజన్ ప్లాంట్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ రంగంలోకి దిగింది. అన్ని ఆస్పత్రుల్లో ఇకపై ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్ మహా నగరంలో ఇప్పటికీ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లోనే కాదు అనేక ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినంత ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు లేవు.
రోగుల అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు కంపెనీల నుంచి సిలిండర్లు తెప్పించి అందిస్తుండటం, అత్యవసర పరిస్థితుల్లో తీవ్రమైన కొరత ఏర్పడుతుండటం ఈ అంశం ఇటు ప్రైవేటు ఆస్పత్రులనే కాకుండా ప్రభుత్వాన్ని కూడా ఇరుకునపెడు తోంది. థర్డ్‌వేవ్ ముప్పు ముంచుకొస్తున్న నేపధ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఆ మేరకు నూరు పడకలు దాటిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు తప్పనిసరి చేసి ఆ మేరకు ఆయా ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా ఉత్పత్తి ట్యాంకులను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించింది.
భవిష్యత్తు అవసరాల మేరకు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో 19,697 సాధారణ పడకలు ఉండగా, 16405 ఆక్సిజన్, 8,486 వెంటిలేటర్ పడకలు ఉన్నాయి. సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉన్న ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ దొరక్క తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. నిజానికి ఆయా ఆస్పత్రుల్లో పూర్తి స్థాయి వైద్యసేవలు అందాలంటే రోజుకు కనీసం 384 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని ఆ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది.
ఇదే అంశాన్ని కేంద్రానికి స్పష్టం చేసింది. అయితే కేంద్రం మాత్రం రోజుకు 160 నుంచి 200 టన్నులకు మించి సరఫరా చేయలేకపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ప్రత్యేక రైళ్లు, విమానాలు పంపి ప్రాణవాయువు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. మళ్లీ ఆ విపత్కర పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ముందస్తుగా వందపడకల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆస్పత్రుల్లో సొంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ పరిధిలోని ఆస్పత్రులకు తాఖీదులు జారీ చేస్తున్నారు.
పడకల సామర్థ్యాన్ని బట్టి ప్లాంట్
తెలంగాణ వ్యాప్తంగా వంద పడకలకుపైగా ఉన్న ఆస్పత్రులు 500 వరకు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే 300 వరకు ఉన్నాయి. ఇక 200 పడకలు దాటిన ఆస్పత్రులు వంద వరకు ఉండగా...500 పడకలు దాటినఆస్పత్రులు 30 వరకు ఉన్నాయి. వీటిలో వంద నుంచి 200 పడకల సామర్థ్యం ఉన్న ఒక్కో ఆస్పత్రిలో నిమిషానికి 500 లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ట్యాంకులను, 200 నుంచి 500 పడకలు ఉన్న ఆస్పత్రిలో నిమిషానికి 1000 లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఆక్సిజన్ ప్లాంటును, 500పైగా పడకలున్న ఆస్పత్రిలో నిమిషానికి 2వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో రూ.2.50 కోట్లతో నిమిషానికి రెండు వేల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఉత్పత్తి ప్లాంటును ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. సామాజిక బాధ్యతగా మరో ఆరు కార్పొరేట్ సంస్థలు ఇదే ఆస్పత్రిలో ఐదు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. వీటి ద్వారా రోజుకు నాలుగు టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది. మిగిలిన ఆక్సిజన్ ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిస్తారు.
ఆక్సిజన్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం (నిమిషానికి) ఇలా...
పడకల సామర్థ్యం | ఉత్పత్తి సామర్థ్యం |
100 నుంచి 200 | 500 ఎల్‌పీ |
200 నుంచి 500 | 1000 ఎల్‌పీ |
500పైగా.. | 2000 ఎల్‌పీ |
Comments
Please login to add a commentAdd a comment