
సాక్షి, హైదరాబాద్: అయోధ్య రామమందిరం భూమిపూజ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు నగరపోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ.. రామమందిర శంకుస్థాపన సందర్భంగా హైదరాబాద్‌లో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదు.
రాజకీయ, సామాజిక ర్యాలీలకు అనుమతి లేదు. సామూహికంగా గుమికూడి పూజలు చేయవద్దు. లడ్డూల పంపిణీకి కూడా అనుమతి లేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనని అంజనీ కుమార్ పేర్కొన్నారు. కాగా.. నగరంలో పలు పోలీస్ స్టేషన్స్‌కి సంబంధించిన కమ్యూనల్ రౌడీషీటర్‌లను పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎలాంటి సంఘటనల్లో పాల్గొనవద్దని పోలీసులు వారిని హెచ్చరించారు.