భాగ్య నగరి నుంచి... ఆయోధ్యా పురికి! | Ayodhya Ram Temple Doors Prepared In Hyderabad | Sakshi
Sakshi News home page

భాగ్య నగరి నుంచి... ఆయోధ్యా పురికి!

Published Thu, Dec 28 2023 11:03 AM | Last Updated on Thu, Dec 28 2023 12:13 PM

Ayodhya Ram Temple Doors Prepared In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. యావత్ దేశం ఇందులో పాలు పంచుకుంటోంది. అయోధ్య రాముని ఆలయానికి తలుపులు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సంస్థే ఈ పనిని చేపట్టింది. గర్భగుడి తలుపులతో పాటు ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న అన్ని తలుపులను రూపొందిస్తోంది. 

హైదరాబాద్‌కు చెందిన అనురాధ టింబర్ డిపో ఆలయ తలుపులను సిద్ధం చేస్తోంది. గత ఏడాది జూన్‌ నుంచి ఈ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. సంస్థ డైరెక్టర్ శరత్ బాబు మాట్లాడుతూ.. గర్భగుడి తలుపు 5 ఏళ్ల రాముడి విగ్రహాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. తలుపులు 8 అడుగుల పొడవు,12 అడుగుల వెడల్పు, ఆరు అంగుళాల మందంతో బలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆలయం చుట్టూ 100 ఫ్రేమ్‌లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. 118 తలుపులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 

అయోధ్య రామాలయ తలుపులు తమిళనాడుకు చెందిన హస్తకళాకారులు నిర్మించారు. తామర, నెమళ్లు సంప్రదాయ భారతీయ సాంస్కృతిక చిహ్నాలతో నగారా శైలిలో తయారు చేశారు.  నగారా అనేది ఉత్తర భారతీయ ఆలయ నిర్మాణ శైలి. ఇది గుప్తుల కాలంలో మూడవ శతాబ్దంలో ప్రారంభమై ముస్లింల ఆగమనం వరకు కొనసాగింది. తలుపులకు మహారాష్ట్రకు చెందిన బలార్షా టేకు చెక్కను ఉపయోగించారు. ఈ చెక్క భాగం బంగారు రేకుతో కప్పబడి ఉంటుంది. 

రామాలయ తలుపులు నిర్మించడానికి దేశంలో ప్రధాన సంస్థలకు ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన సంస్థకే ఈ పనిని అప్పగించారు. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఆలయ మొదటి అంతస్తు వరకు నిర్మాణం పూర్తైంది. ప్రస్తుతం అలంకరణల పని జరుగుతోంది. 
 

ఇదీ చదవండి: 'రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement