
సాక్షి, హైదరాబాద్: ‘వైకల్యం కలిగిన పైలట్‌ను ఏదైనా విమానయాన సంస్థ ఉద్యోగంలో తీసుకుంటుందా? వైకల్యం కలిగిన శస్త్రచికిత్స నిపుణుడిపై మీరు నమ్మకం ఉంచుతారా? మరీ అత్యంత ప్రతిష్టాత్మకమైన అఖిల భారత సేవల (ఏఐఎస్) (ఐఏఎస్/ఐపీఎస్/ఐఎఫ్‌ఎస్ తదితర) ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల కోటా ఎందుకు?’అని సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ ‘ఎక్స్’వేదికగా ఆదివారం ప్రశ్నించారు. ఉద్యోగ స్వభావ రీత్యా అఖిలభారత సేవల అధికారులు క్షేత్రస్థాయిలో గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుందని, ప్రజల విన్నపాలను నేరుగా వింటూ పనిచేయాల్సి ఉంటుందని, దీనికి శారీరక ఆరోగ్యం అవసరమని స్పష్టం చేశారు.
స్మితా వ్యాఖ్యలు సరికాదు..
వైకల్యాలు శక్తిసామర్థ్యాలు, మేధోశక్తిపై ప్రభావం చూపవని సీనియ ర్ సుప్రీంకోర్టు న్యాయవాది కరుణ, బ్యూరోక్రాట్లు తమ సంకుచిత స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారని శివసేన ఎంపీ ప్రియాంక చతు ర్వేది విమర్శించారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సరికాదని ఆమె వారికి క్షమాపణ చెప్పాలని, వికలాంగుల కమిషన్ ఆమెపై కేసు నమోదు చేయాలని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, తెలంగాణ వికలాంగుల సంఘాల జేఏసీ కనీ్వనర్ నారా నాగేశ్వరరావు ఆదివారం ప్రకటనలో వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.