ఇప్పటికే 60 రకాల జాతుల బటర్ ఫ్లైల గుర్తింపు
మూడు నెలలుగా కవ్వాల్ టైగర్ రిజర్వులో పరిశీలన
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సీతాకోకచిలుక ఏ చెట్టుపై వాలుతుంది.. ఏ పువ్వులోని మకరందాన్ని స్వీకరిస్తుంది ? గతంలో ఉన్న సీతాకోక చిలుకలు.. ప్రస్తుతం ఉన్నాయా? వాటి ఆవాసం..అనుకూలత మెరుగుపడాలంటే ఏం చేయాలి? తదితర విషయాలు తెలుసుకుంటూ వాటి సంరక్షణకు కృషి చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా అటవీ శాఖ అధికారులు.
మూడు నెలలుగా కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో బటర్ ఫ్లై జాతుల గుర్తింపునకు సర్వే జరుగుతోంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్(వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్), మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్ రాంజన్ విరాని, పక్షుల నిపుణులతో ముందుగా 30 మంది అధికారులకు శిక్షణ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులు ప్రతీరోజు సర్వే చేస్తున్నారు. రంగు, ఆకారం తదితర గుణాల ఆధారంగా సీతాకోక చిలుకలను గుర్తించి రికార్డు చేస్తున్నారు.
100 నుంచి 150జాతులు ఉన్నట్టు అంచనా
కవ్వాల్ పరిధిలోని కోర్, బఫర్ ప్రాంతాల్లో 100 నుంచి 150 సీతాకోక చిలుకల జాతులు ఉంటాయని అంచనా. కడెం, గోదావరి, ప్రాణహితతోపాటు వాగులు, వంకలు, రిజర్వు ఫారెస్టు, మైదాన ప్రాంతాల్లోనూ సర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు 60 రకాల వరకు సీతాకోక చిలుకలను గుర్తించారు.
వాటి ఫొటోలతోపాటు ఆవాసం, జీవన విధానం, ప్రత్యేకత తదితర వివరాలను నిక్షిప్తం చేస్తున్నారు. టైగర్ సఫారీకి వచ్చే పర్యాటకులకు బటర్‌ఫ్లై పార్కులు చూపిస్తూ ఓ ప్రత్యేక అనుభూతి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. జన్నారం పరిధిలో ఓ బటర్‌ఫ్లై పార్కును అభివృద్ధి చేశారు.
ఇదే తరహాలో మంచిర్యాల పట్టణానికి సమీపంలో గాంధారి ఖిల్లా, చెన్నూరు అర్బన్ పార్కు, బెల్లంపల్లి డివిజన్లలోనూ సిద్ధం చేస్తున్నారు. వనదర్శినిలో భాగంగా స్థానికులు, పర్యాటకులకు అడవులు, వన్యప్రాణులపై అవగాహనతోపాటు ఇకపై సీతాకోక చిలుక జీవన విధానం, వాటి పరిరక్షణ చర్యలను ప్రత్యేకంగా వివరించనున్నారు.
జీవ వైవిధ్యానికి గుర్తు
ప్రకృతిలో జీవ వైవి«ధ్యానికి గుర్తుగా సీతాకోక చిలుకను చెబుతారు. వీటి మనుగడే అక్కడి పర్యావరణ అనుకూలత, ప్రతికూలతను తెలియజేస్తుందని నిపు ణులు పేర్కొంటున్నారు.
భూమిపై మొలిచే మొక్కలు, చెట్లు, గాలిలో ఎగిరే పక్షులు, ఇతర క్రిమికీటకాలు, జంతుజాలంతో ప్రత్యక్ష సంబంధముండే సీతాకోక చిలుకలు ఆ ప్రాంతం పర్యావరణ వ్యవస్థ, ఆహారపు గొలుసు లో కీలకంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పుష్పాల పుప్పొడి, మకరందం, ఆవాసాలు, విత్తన వ్యాప్తి, పక్షుల మనుగడ, క్రిమికీటకాలను సమతుల్యం చేయడం వంటివి సీతాకోకచిలుకకు ప్రధాన క్రియలుగా ఉంటాయి.
ప్రత్యేకంగా పార్కులు
కవ్వాల్‌లో కేవలం పులులే కాకుండా, అన్ని జీవులను సంరక్షించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ ఎన్నో రకాల సీతాకోకచిలుకలు ఉన్నాయి. వాటిని సంరక్షిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది. పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందుకు ప్రత్యేకంగా బటర్‌ఫ్లై పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. - శివ్‌ఆశిష్ సింగ్, జిల్లా అటవీ అధికారి, మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment