
సాక్షి, హైదరాబాద్ : కాలుష్యకారక కార్బన్ డయాక్సైడ్ (సీఓ2)తో పనిచేసే బ్యాటరీని అభివృద్ధి చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక స్వర్ణ జయంతి ఫెలోషిప్ లభించింది. లోహాలతోపాటు కార్బన్ డయాక్సైడ్‌ను ఉపయోగించి ఇంధనాన్ని నిల్వ చేసే ఈ బ్యాటరీ 2024లో భారత్ అంగారక ప్రయోగానికి, కాలుష్యరహిత ఇంధన ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడుతుందని అంచనా. హైదరాబాద్ ఐఐటీలోని కెమికల్ ఇంజనీరింగ్ అండ్ క్రియేటివ్ అండ్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ బేస్డ్ ఆన్ నానోమెటీరియల్స్ క్లుప్తంగా కార్బన్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ చంద్రశేఖరశర్మ కొంతకాలంగా కార్బన్ డయాక్సైడ్ బ్యాటరీ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ రకమైన బ్యాటరీ తయారీ సాధ్యమే అని ఇప్పటికే నిరూపించారు కూడా. ఈ ఆలోచనను నిజరూపంలోకి తెచ్చేందుకు స్వర్ణజయంతి ఫెలోషిప్ ఉపయోగపడనుంది. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విభాగం, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డులు కూడా తమ వంతు సహకారం అందిస్తాయి. ఈ సరికొత్త బ్యాటరీ తయారీ పూర్తయితే వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమైన కార్బన్ డయాక్సైడ్‌ను గణనీయంగా తగ్గించవచ్చు కూడా.
అంగారకుడిపైనా అదే వాయువు...
2024లో అంగారకుడిపైకి ఒక అంతరిక్ష నౌకను పంపాలని ఇస్రో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అరుణగ్రహ వాతావరణంలో దాదాపు 95 శాతం కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఆ గ్రహంపై తిరిగే రోవర్లు, ల్యాండర్లను నడిపేందుకు ఈ వాయువుతో నడిచే బ్యాటరీలు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. బ్యాటరీల బరువు తగ్గడంతోపాటు అతితక్కువ ప్రాంతంలో ఎక్కువ విద్యుత్‌ను నిల్వ చేసుకోవచ్చు. తద్వారా ప్రయోగ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు చేసిన సీఓ2 బ్యాటరీ ప్రతిపాదనకు ప్రాముఖ్యత ఏర్పడింది. స్వర్ణ జయంతి ఫెలోషిప్ ఆసరాగా నమూనా సీఓ2 బ్యాటరీని తయారు చేసేందుకు ఐఐటీ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment