ఫ్రెంచ్ వనిత డా‘‘ డెలాల్ బెన్బాబాలి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో సోషల్ జాగ్రఫీ – ఆంత్రో పాలజీ స్కాలర్. ఆమె – ‘క్యాస్ట్ డామినెన్స్ అండ్ టెరిటరీ ఇన్ సౌత్ ఇండియా: అండర్‌స్టాండింగ్ కమ్మాస్ సోషియో –స్పేషియల్ మొబిలిటీ’ అంశంపై పరిశోధన చేశారు. ఆమె తన పరిశోధనలో ప్రధానంగా దృష్టి పెట్టిన అంశం ఆసక్తికరమైనది. ఒక భూభాగంపై ఆధిపత్యం చలాయించే విషయంలో జనాధిక్యత ఉండే కులాలకూ, ఆధిపత్య కులాలకూ మధ్యఉండే వ్యత్యాసాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేశారామె. ‘హైదరాబాద్ నగరంలో ఆంధ్ర కల్చర్ విస్తరించడంలో కొత్తగా వలస వచ్చినవారి పాత్ర,’ ‘సామాజిక ఊర్ధ్వ చలనానికి దోహదం చేస్తున్న వలసలు’ వంటి మరో రెండు పరిశోధనా పత్రా లను కూడా గమనిస్తే వాటిల్లో ‘కామన్’గా కనిపి స్తున్న అంశాలు మూడు ఉన్నాయి. అవి – భూమి, వలసలు, ఆధిపత్యం.
ఈ అంశాలను, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అన్వయించడం జరిగింది. ఆమె విదేశీ స్కాలర్ కనుక ఆమెకు ఇక్కడి రాజకీయాలు, కులాల విషయంలో ఇష్టాయిష్టాలకు ఆస్కారం లేదు. పైగా ఆమె పరిశోధనా వ్యాసాలు 2010కి ముందు కాలం నాటివి. కనుక ఆమె సూత్రీక రణలలోని నిజాయతీని అనుమానించడానికి ఆస్కారం కనిపించదు. అయితే, ఆమె తన మొత్తం పరిశోధనను – ‘ఆధిపత్యం’ వద్దకు తెచ్చి ఒక ముగింపు ఇవ్వడం, అందుకు ఆమె తీసుకున్న ఉదాహరణను ముందుగా మనం గుర్తించాలి.
ఆంధ్ర ప్రాంతం నుంచి వలసవచ్చిన చంద్రబాబు కులస్థులు హైదరాబాద్ నగరానికి పశ్చిమాన జూబ్లీ హిల్స్–కూకట్ పల్లికి మధ్య ఉన్న భూములను ఆవాసాలుగా చేసుకుని స్థిరపడ్డారు. దాంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆప్రాంతంలో ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారాన్ని ప్రోత్స హించి, దాన్ని ‘సైబరాబాద్’ అంటూ వారు ప్రయోజనం పొందే వ్యూహాన్ని అమలు చేశారు. అతని వ్యూహం మేరకు అది విజయవంతం అయినప్పటికీ, హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణ జిల్లాల్లో కూడా స్థానికులు వీరి ‘ఆధిప త్యాన్ని’ ప్రశ్నించడంతో రాష్ట్ర విభజన జరిగింది. దాంతో ఏపీ సీఎంగా చంద్రబాబు మళ్ళీ అదే పాత ‘సైబరాబాద్’ వ్యూహాన్ని ఈసారి – ‘రాజధాని అమరావతి’ పేరుతో ఇక్కడ అమలుకు తెర తీశారు.
బాబు దాని కోసం, భారత ప్రభుత్వం నియమించిన ‘శివరామ కృష్ణన్ కమిటీ’ నివేదికను సైతం పక్కనపెట్టి, అందుకు ‘ఎన్డీయే’లో టీడీపీ భాగస్వామ్యాన్ని అడ్డంగా వాడుకున్నారు. అమరావతి భూమి పూజకు 2016లో వచ్చిననరేంద్రమోదీ ఆ తర్వాత, బాబు ఏపీ తన సొంత జాగీరు అన్నట్టుగా, విదేశీ కంపెనీలతో నిర్మాణ ఒప్పందాలు, ‘అమరావతి’ భూముల్లో వాటాలు ఇచ్చినా, ఏనాడూ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? అని అడిగింది లేదు. బాబు నిజంగా ‘విజనరీ’ అయితే, కొత్త రాష్ట్రం అభివృద్ధి కోసం మొదటి ఐదేళ్లలో పూర్తి చేయగలిగిన ‘ప్లాన్’ మాత్రమే అమలు చేయాలి. అదే జగన్ మోహన్ రెడ్డి విషయంలో చూడండి. అన్ని ఆర్థిక స్థాయుల్లోని వర్గాలకు ‘సంక్షేమం’అందిస్తూనే, రెండున్నర ఏళ్ళ ‘కరోనా’ కాలాన్ని దాటి, తీరాంధ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టి 16 వేల కోట్ల రూపాయలతో 4 పోర్టులు, రూ. 3,793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లేండ్‌సెంటర్లు నిర్మిస్తున్నారు.
అలా శ్రీకాకుళం నుంచి చిత్తూరు సరిహద్దు వరకు సముద్ర తీరం వెంట సహజ ప్రకృతి వనరుల అభివృద్ధికి పెట్టుబడుల్ని వికేంద్రీకరించడం వల్ల; భవిష్యత్తులో ‘భూమి’ దాని సొంతదారు ‘ఆధిపత్యం’ వంటివి ఇకముందు లేకపోగా, ‘వలసలు’ కూడా ఇకముందు తగ్గుతాయి. డా‘‘ డెలాల్ బెన్బాబాలి తన పరిశోధనా వ్యాసాల్లో ప్రస్తావించిన – భూమి, వలసలు, ఆధిపత్యం అంశాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ తన తొలి టర్మ్‌లోనే ‘అడ్రెస్’ చేయడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఆమె పరిశోధనా వ్యాసాలు– కమ్మ కులం కేంద్రంగా ఉన్నప్పటికీ, రెడ్ల ప్రస్తావనను ఆమె వదిలి పెట్టలేదు. అయినా ఇక్కడ కులాలు ఏవి అనే ఆరా కంటే, ‘ఎప్పుడు’, ‘ఎవరు’ అనే దృష్టి మనకు ముఖ్యం.
దేశం స్వతంత్రమై వందేళ్లకు చేరువ అవుతున్నప్పుడు, వనరుల పంపిణీ అన్ని ప్రాంతాలకూ, అన్ని సామాజిక వర్గాలకూ వారి వారి దామాషా మేరకు చేరే ప్రయత్నం మొద లయిందా లేదా అనేది ఇక్కడ కీలకం. తన మొదటి ఐదేళ్ల టర్మ్ లోనే 13 జిల్లాలను 26గా చేసి ప్రభుత్వాన్ని సూక్ష్మ స్థాయికి తీసుకువెళ్లడంలో జగన్ ప్రభుత్వం విజయవంతం అయింది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఇప్పుడు జరుగుతున్న వనరుల పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. అనుమానం లేదు, అందువల్ల పేద వర్గాల జీవన ప్రమాణాలు మునుపటి కంటే చాలా బాగా మెరుగవుతాయి.
- వ్యాసకర్త మాజీ శాసన సభ్యులుమొబైల్: 98481 28844
- అడుసుమిల్లి జయప్రకాష్
Comments
Please login to add a commentAdd a comment