సాక్షి, హైదరాబాద్: మొన్న జూబ్లీహిల్స్.. నిన్న మొఘల్‌పుర... తాజాగా కాలాపత్తర్... కామాంధుల చేతుల్లో ముగ్గురు బాలికలు నలిగిపోయారు. లైంగిక దాడుల నుంచి మైనర్లకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన పోక్సో యాక్ట్–2012 అమలులో ఉన్నా ఘోరాలు ఆగట్లేదు. ఏదైనా కొత్త చట్టం తీసుకురావడంలో నిందితుల్ని కఠినంగా శిక్షించడానికి అనేది పైకి కనిపించే అంశమైతే... అంతర్గతంగా ఉండే దీని ప్రధాన ఉద్దేశం ఆ తరహా నేరాలు పునరావృతం కాకుండా చూడటమే. కేంద్ర ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పోక్సో యాక్ట్ ఈ కోణంలో ఆశించిన స్థాయి ఫలితాలు ఇవ్వట్లేదనే వాదన వినిపిస్తోంది. ఈ పరిస్థితులు తలెత్తడానికి ప్రధాన కారణం అవగాహన లోపమని నిపుణులు
చెబుతున్నారు.
ప్రేమ పేరుతో వల..
బాలికలపై జరుగుతున్న ఘోరాల్లో అనేకం ప్రేమ పేరుతో వలలో పడేసుకుని చేసేవే ఉంటున్నాయి. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణనే ప్రేమగా భావిస్తున్న మైనర్లు ఈ వలలో పడుతున్నారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావంతో విపరీత పోకడలు అనుసరించి భవిష్యత్తును బుగ్గి చేసుకుంటున్నారు. ఓ బాలికను ఆమె అనుమతితో పెళ్లి చేసుకున్నా, సన్నిహితంగా గడిపినా కూడా అది నేరమే అవుతుంది. అభ్యంతరకంగా కామెంట్స్ చేయడమూ పోక్సో చట్ట ప్రకారం తీవ్రమైన అంశమే. ఇలాంటి చట్టాన్ని చేసిన యంత్రాంగాలు అక్కడి తమ పని అయిపోయిందన్నట్లు చేతులు
దులుపుకొన్నాయి.
అవగాహనలో విఫలం..
కేంద్ర ప్రభుత్వం అత్యంత శక్తిమంతమైందని చెప్పుకున్న పోక్సో చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చినప్పటికీ చిన్నారులు, బాలికలపై అఘాయిత్యాలు తరచూ జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ‘పోక్సో’పై అందరికీ అవగాహన కల్పించడంలో విఫలం ఒక కారణమైతే... మిగిలిన కీలకాంశాలను పట్టించుకోక మరో కారణం. కేవలం ఓ చట్టాన్ని తీసుకురావడం ద్వారా కుటుంబ, సామాజిక తదితర పరిస్థితుల్లో పూర్తి మార్పు తీసుకురావడమనేది దుర్లభమని నిపుణులు చెబుతున్నారు. ఇవి మారాలంటే సమస్యని లోతుగా అధ్యయనం చేయాలి. ఇలాంటివి పునరావృతం కావడానికి కారణాలను గుర్తించాలని సూచిస్తున్నారు. వాటిని సాధ్యమైనంత వరకు కూకటివేళ్లతో సహా పెకిలించి వేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నారు.
చదవండి: లవ్ ఫెయిల్యూర్.. యువతి ఆత్మహత్య.. మృతిపై భిన్న కథనాలు..
అఘాయిత్యాలకు కారణాలు అనేకం...
చిన్నారులపై అఘాయిత్యాలకు ప్రధానంగా అనేక కారణాలు ఉంటున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, విదేశీ సంస్కృతి మోజులో యువత దారి తప్పడం, తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సరైన సత్సంబంధాలు లేకపోవడం, మత్తుమందులు, వ్యసనాలకు బానిసైన యువకులు, సినిమా, సోషల్ మీడియాల్లో మితిమీరుతున్న అశ్లీలం, మహిళల్ని వ్యాపార వస్తువుగా చిత్రీకరిస్తున్న ప్రకటనలు, చదువుకునే వయసులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఆకర్షణ, ప్రలోభాలకు లోనుకావడం ప్రధానమైనవని వివరిస్తున్నారు.
ఇళ్లల్లో పిల్లలపై పెద్దలు శ్రద్ధ పెట్టాలి. ఆడపిల్లల్ని గౌరవించడం, మహిళలతో మర్యాదగా ప్రవర్తించడం, సమాజంలో వారికి ఉండాల్సిన సముచిత స్థానం తెలియజేస్తూ సభ్యత, సంస్కారాలకు నేర్పించాలి. మహిళలపై అఘాయిత్యాలు జరిగిన తరవాత బాధపడేకంటే... జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణుడు ప్రతాప్‌కుమార్ తెలిపారు.
చిన్నారులు, మహిళలపై జరుగుతు న్న దారుణాల్లో సగం కూడా పోలీసు వరకు రావడం, రికార్డుల్లోకి ఎక్కడం జరగట్లేదు. దీనికి పరువు, కుటుంబ నేపథ్యం వంటి ఎన్నో కారణాలు ఉంటున్నాయి. బాధితుల మౌనంతో వస్తున్న ఈ ఉదాసీనత ముష్కరులు మరింతగా రెచ్చిపోవడానికి ఊతం ఇచ్చినట్లేనని గుర్తుంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment